ప్రజాశక్తి-పొదిలి: మండల కేంద్రమైన మర్రిపూడి గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మాగాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్కా యోజన – సబ్కా వికాస్ కార్యక్రమం సందర్బంగా ప్రత్యేక గ్రామసభ సర్పంచి కదిరి భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరైన ఈ కార్యక్రమంలో స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో 75 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో మర్రిపూడిని చేర్చడం ఎంతో సంతోషంగా ఉందని అందుకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామాభివృద్ధికి 70 సంవత్స రాలు పైబడిన వృద్ధులు, వయోవృద్ధులు వారి సూచనలు, సలహాలు తీసుకోవడం ద్వారా సమాజంలో మార్పుకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు. వయోవృద్ధుల సూచన లు, సలహాల మేరకు గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. గతంలో తాను 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తమ ప్రభుత్వం ద్వారా మండలంలోని దుగ్గిరెడ్డిపాలెం, అయ్యపు రాజుపాలెం, పొట్టిరెడ్డిపాలెం గ్రామాలకు రోడ్లు మంజూరు చేయించినా గత ప్రభుత్వంలో వాటి నిర్మాణం చేయలేకపోయింద న్నారు. గ్రామీణ మండల కేంద్రమైన మర్రిపూడి పంచాయ తీకి ఇప్పటికే తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గంగ పాలెం, రాజుపాలెం గ్రామాల్లో 15 లక్షలు చొప్పున సిమెంట్ రోడ్లు మంజూరు చేయించామన్నారు. సబ్‌కా యోజనా సబ్‌కావికాస్‌కు ఎంపికైన మర్రిపూడి మండల కేంద్రంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవా లని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. పెన్షన్ కొందరికి రావడం లేదని, అర్హులను గుర్తించి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏకపక్షంగా అనర్హుల పేరుతో ఎవరినీ తొలగించబోమని, అవసరమైతే వికలాంగుల పింఛన్లను మరోసారి డాక్టర్ ద్వారా పరీక్ష చేయించి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి నాటికి మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తామని తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ మండల కేంద్రంగా ఉన్న చిన్న గ్రామమైన మర్రిపూడి అభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ చూపుతానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ -2047కు సంబంధించిన ప్రత్యేక ప్రణాళికను వివరించిన 9వ తరగతి విద్యార్థిని లక్ష్మి అనన్యను కలెక్టర్ సత్కరించారు. ఎంపి మాగుంట మాట్లాడారు.