ఎపిఐఐసి బలోపేతానికి చర్యలు : మంత్రి

Jan 7,2025 21:27

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర వ్యాప్తంగా ఎపిఐఐసిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కోటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎపిఐఐసిను బలోపేతం చేసేందుకు సంబంధిత ఎండితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. పరిశ్రమలకు స్థలాలు తీసుకున్న పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయని వారిపై చర్యలకు సిద్దమవుతున్నామని చెప్పారు. మరుపల్లిలో 80 ఎకరాలు భూమిని పారిశ్రామికవేత్తకు కేటాయించినా పరిశ్రమ ఏర్పాటు చేయలేదన్నారు. నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎపిఐఐసిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు మండలానికి, నియోజకవర్గానికి ఒక ఐపిఒను నియమిస్తామన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్‌ కూటమి ప్రభుత్వంపై హేళనగ మాట్లాడడం సరికాదన్నారు. ప్రధాని మోడీ సభకు జిల్లా నుంచి 40వేల మందిని తరలిస్తున్నట్లు చెప్పారు.పుష్పయాగంలో పాల్గొన్న మంత్రి స్థానిక కోటలో దర్బార్‌ మహల్‌, శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన పుష్పయాగంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. వెంకన్న స్వామిని 108 రకాల పువ్వులతో పూజలు చేశారు. కోట నుంచి శ్రీవేణుగోపాల స్వామి ఆలయానికి పువ్వులు బుట్టలను మోసుకుని వెళ్లి స్వామివారికి పుష్పయాగం చేసి ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీపురం, కురుపాం ఎమ్మెల్యేలు విజయచంద్ర, జగదీశ్వరి హాజరయ్యారు. పుష్పయాగానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి గజపతినగరం : మండలంలోని బాలాజీ పాలిటెక్నికల్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సంప్రదాయ దుస్తులలో విద్యార్థులు మంత్రికి స్వాగతం పలికారు. భోగి మంట చుట్టూ విద్యార్థులతో కలిసి ధింసా నృత్యం చేశారు. బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్‌, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️