సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో రైసు మిల్లులో తనిఖీలు చేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి, సత్తెనపల్లి రూరల్ : గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 8 రైస్ మిల్లులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వెలుగు చూసిన అక్రమాలపై మంత్రి అవాక్కయ్యారు. దాదాపు వెయ్యి టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రామలింగేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లును తనిఖీ చేసిన మంత్రి వందలకొద్దీ రైస్ బ్యాగుల్లో రేషన్ బియ్యాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి రైస్ మిల్లులోనే 100 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి తహశీల్దార్ చక్రవర్తిని ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెట్రాలజీ, సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ అధికారులు రైస్‌మిల్లులోని ప్రతి బ్యాగ్‌ని పరిశీలించాలని, పంచనామా అనంతరం క్రిమినల్ కేసులు నమోదు చేసి మిల్లును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి పట్టణంలో సీతారామాంజనేయ సాయి, గణేష్ రైస్‌మిల్ అండ్ ఫ్లోర్‌మిల్, శ్రీదేవి ట్రేడర్స్, రావు రైస్ అండ్ ఫ్లోర్ మిల్, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లులను మంత్రి తనిఖీ చేశారు. గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలం పేరెచర్లలో మూడు రైస్ మిల్లులను మంత్రి తనిఖీ చేశారు. రైస్ మిల్లు ప్రాంతంలో రేషన్ సరఫరా చేసే వాహనాన్ని దాచి ఉంచిన వైనాన్ని చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. వాహనాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి రాకను ముందుగానే తెలుసుకుని పేరేచర్ల వెంకటేశ్వర రైస్‌మిల్ ప్రాంగణంలో సిఎంఆర్ రైస్ బ్యాగ్ టాగ్‌లను నిర్వాహకులు దహనం చేశారు. మిల్లు సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని, పంచనామ నిర్వహించి కేసు నమోదు చేయాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని విఘ్నేశ్వర రైస్‌మిల్లులో తనిఖీ చేసిన మంత్రి టార్చ్‌లైట్ వెలుగులో బియ్యం, రికార్డులు, 26 కిలోల బియ్యం బస్తాల తూకాన్ని పరిశీలించారు. రైస్ మిల్లు తనిఖీల కోసం సత్తెనపల్లి వచ్చిన మంత్రి రోడ్డు పక్కనే కారు ఆపించి బడ్డీ కొట్టు వద్ద టీ తాగారు. అక్కడ సామాన్యులను నిత్యావసర ధరలపై ఆరా తీశారు. చివరిగా ప్రత్తిపాడులో మిల్లును తనిఖీ చేశారు. ప్రత్తిపాడు నుంచి మహరాష్ట్రకు రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్టు గుర్తించారు.
అర్హతున్న అందరికీ దీపం కథకం-2 : మనోహర్
రాష్ట్రంలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దీపం పథకం-2 వర్తిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 లక్షల మంది వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకోగా 16 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేశామని, ఇప్పటివరకు రూ.84 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో కోటి 47 లక్షల రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. కిలోకు రూ.43.40 ఖర్చును ప్రభుత్వాలు భరిస్తుంటే ఈ బియ్యాని రేషన్ మాఫియా విదేశాలకు తరలిస్తోందని అన్నారు. మంత్రి వెంట పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సురజ్ గనోరే, సత్తెనపల్లి ఆర్‌డిఒ జి.రమాకాంతరెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి నారదముని, తునికల కొలతల శాఖ అధికారులు ఉన్నారు.