ప్రజాశక్తి-టంగుటూరు : సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలన్నదే లక్ష్యంగా ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మండల పరిధిలోని సురారెడ్డిపాలెం, వల్లూరు పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులకు ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు సోమవారం పపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ ఎన్‌టిఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, అభివద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ప్రతి నెలా 1న పెన్షను అందజేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఎస్‌సి,ఎస్‌టి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వసతి కల్పించి ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మానాయక్, ఎంపిడిఒ రత్నజ్యోతి, టిడిపి మండల అధ్యక్షుడు కామని విజయకుమార్, నాయకులు ఈదర ప్రభాకర్, రామా గోపి, బొజ్జా శ్రీను, సూరారెడ్డిపాలెం సర్పంచి నర్రా శైలుషా, ఉప సర్పంచి మెలకలపల్లి కోటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. శింగరాయకొండ : మండల పరిధిలోని మూలగుంటపాడు పంచాయతీలో ఎన్‌టిఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, 228 బూత్ కన్వీనర్ నరాల సుధాకరరావు, చిగురుపాటి గిరి, ఎస్.మల్లిఖార్జున మాజీ ఎంపిటిసి ఎల్‌వి.వర్మ, చల్లా శ్రీను, జి.వెంకట్రావు, ఎంపిడిఒ జయమణి, పంచాయతీ కార్యదర్శి రామారావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పెద్దారవీడు : మండల పరిధిలోని గుండంచర్ల గ్రామంలో టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరీక్షన్‌బాబు అధికారులతో కలిసి ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.