మిర్చి రైతుకు నష్టాల ఘాటు!

Feb 19,2025 00:47

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : దాదాపు ఆరేళ్ల తరువాత మిర్చి రైతులు మళ్లీ సంక్షోభంలో చిక్కుకున్నారు. 2018 నుంచి 2024 వరకు ఆశాజనకంగా ఉన్న ధరలు ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి. దీంతో రైతులకు ఎకరాకు సగటున రూ.50 నుంచి రూ.లక్ష వరకు నష్టాలు వస్తున్నాయి. మిర్చి సాగులో ఎన్ని కష్టాలు ఎదురైనా మంచి ధరలు వస్తాయన్న ఆశతో ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్లోసాగు చేయగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది పండిన పంట కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉండటం, కొత్త పంటకు ఎగుమతులకు ఆర్డర్లు లేకపోవడంతో ధరల పతనం ప్రారంభమైనట్లు వ్యాపారులు చెబుతు న్నారు. ఇప్పటికి కోల్డ్‌ స్టోరేజిల్లో 15 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయి. ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. సగటున 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో క్వింటాళ్‌ రూ.18 నుంచి రూ.20 వేల వరకు పలికిన ధర ఈ ఏడాది రూ.8 వేలకు నుంచి రూ.13 వేలకు మించడం లేదు. గత ఐదేళ్ల కాలంలో క్వింటాళ్‌ గరిష్టంగా రూ.27 వేల వరకు వెళ్లడంతో రైతులు ఎంత ఇబ్బంది అయినా ధరలు వస్తాయన్న భావనతో మిర్చి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు సగానికి పడిపోగా ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లినా ఇప్పటివరకు స్పందించలేదు. తొలుత నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు ఇటీవల సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. స్పందించిన సిఎం కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదు. మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ పథకం కింద రైతులను ఎలా ఆదుకోవాలనో అధ్యయనం చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ చెప్పారని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. మిర్చి రైతులను కలుసుకునేందుకు మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం గుంటూరు వస్తున్నారనే సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వంలో మళ్లీ కదలిక వచ్చింది. గురువారం ఢిల్లీ వెళ్తనున్న సిఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసి మిర్చి రైతుల సమస్యలపై చర్చిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. చైనాకు ఆర్డర్లు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ విజయ సునీత ప్రకటించారు. ఈనెలాఖకు ధరలు పెరిగే అవకాశం ఉందని ధరలు పెరగకపోతే మార్కెట్‌ ఇంర్‌ వెన్షన్‌ పథకం అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఎగుమతులు లేవని చెబుతున్న వ్యాపారులు రోజుకు లక్ష టిక్కీలు వచ్చినా కొనేస్తున్నారని, తాము పండించిన సరుకు అంతా ఎటుపోతుందోనని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం మిర్చి యార్డుకు 1,42,406 బస్తాలు వచ్చాయి. పాత నిల్వలతో కలిపి 1,39,408 బస్తాలు కొనుగోలు చేశారు. ఇంకా 71,319 బస్తాలు నిల్వ ఉన్నాయి. పంటను ఇటు అమ్ముకోలేక… అటు గిడ్డంగుల్లో దాచుకునే ఖాళీ లేక రైతులు దిగాలు పడిపోతున్నారు. తక్షణం క్వింటాళ్‌కు రూ.15 వేలు తగ్గకుండా మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ పథకం కింద కొనాలని రైతులు కోరుతున్నారు.

➡️