కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతులు
ప్రజాశక్తి-గుంటూరు : మా వద్ద మిర్చి కొనుగోలు చేసి, డబ్బులివ్వకుండా మోసం చేసిన గుంటూరుకు చెందిన వ్యాపారులపై చర్యలు తీసుకొని, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం, గ్రంధసిరి గ్రామానికి చెందిన రైతులు డిఆర్‌ఒకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2024లో తమ గ్రామంలోని ఐదుగురు రైతులం రూ.70.20 లక్షల మిర్చిని గుంటూరులోని విజరుభాస్కర్ ట్రేడర్స్ కమిషన్ కొట్టుకు చెందిన గోపు శ్రీనివాసరెడ్డి, సంగిలి కిషోర్‌రెడ్డికి విక్రయించామన్నారు. కోటపాటి రామకోటేశ్వరరావు 80 క్వింటాళ్లు (రూ.13 లక్షలు), పరుచూరి ప్రతాప్ 75 క్వింటాళ్లు (రూ.12 లక్షలు), కిలారి నాగేశ్వరరావు 90 క్వింటాళ్లు (రూ.14.20 లక్షలు), కోటపాటి నాగేశ్వరరావు 96 క్వింటాళ్లు (రూ.15 లక్షలు), కోటపాటి నరసింహారావు 100 క్వింటాళ్లు (రూ.16 లక్షలు) సరుకు విక్రయించామని వివరించారు. అప్పటి నుండి డబ్బులు ఇవ్వకుండా రేపుమాపు అని తిప్పుకుంటూ నమ్మించి మోసం చేశారన్నారు. మోసపోయామని గ్రహించి, అందరం వెళ్లి అడగగా మాపై రౌడీలతో దాడి చేయించి, కర్రలతో కొట్టించారన్నారు. అంతేకాకుండా వీరికి అండగా జంగా నర్సిరెడ్డి, రామిరెడ్డి, వారి కొట్లో పనిచేసే గుమస్తాలైన శ్రీనివాసరావు, ఆళ్ల రామిరెడ్డి, వారి గ్రామానికి చెందిన షుమారు 20 మందిని తీసుకొచ్చి మాపై దాడి చేయించారని అన్నారు. అనేక సార్లు వెళ్లి అడగినా మొహం చాటేశారన్నారు. పోలీసు కేసు పెడతామని చెప్పినా దిక్కున్నచోట చెప్పుకోవాలని, అసభ్యకరంగా దూషించారని చెప్పారు.
