మిర్చి రైతుల సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యేకు వివరిస్తున్న గోపాలరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మిర్చి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నిలువునా ముంచుతున్నాయని, మద్దతు ధర పేరిట ఊరించి మోసం చేస్తున్నాయని ఎపి రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు విమర్శించారు. మిర్చి రైతులకు క్వింటాళ్‌కు రూ.5 వేలు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నరసరావుపేటలోని టౌన్‌హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పల్నాడు కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ రైతులను మోసం చేయడం సరికాదన్నారు. లక్షలాది రూపాయలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీకి తెచ్చి పెట్టుబడులు పెట్టి, తెగుళ్ల బెడదను అధిగమించి పండించిన మిర్చికి మద్దతు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11781 అసలు గిట్టుబాటు కాదని చెప్పారు. విదేశాలకు ఎగుమతులు తగ్గడంతో ధరల పతనం మొదలైందని, మరోవైపు ధరలు మరింత తగ్గుతాయనే ఆలోచనతో ఆయా కంపెనీలు కూడా కొనుగోళ్లు నిలిపివేశాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మిర్చిరైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతుసంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు, నాయకులు బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
