ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి) : ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డు అందుకున్న అంజలిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం పిచ్చా టూరు ప్రెస్ భవనం లో ఘనంగా సత్కరించారు. ప్రకృతి వ్యవసాయం విస్తరణకు మెరుగైన సేవలు అందించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు నుండి అంజలి రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా రైతు పురస్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంజలి స్వగ్రామమైన పిచ్చాటూరు మండలం అప్పంబట్టు గ్రామానికి ఎమ్మెల్యే చేరుకొని అంజలికి అభినందనలు తెలపడంతో పాటు శాలువా కప్పి, గజ మాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ సత్యవేడు నియోజకవర్గానికి చెందిన అంజలికి రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డు రావడం మన అందరికీ గర్వకారణమన్నారు. అంజలిని ఆదర్శంగా తీసుకుని రైతులు అందరు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. తద్వారా మానవాళికి నాణ్యమైన, ఆరోగ్య కరమైన ఆహారం అందించాలని, భూమి సైతం సారవంతంగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ రెడ్డి, ఆరుల్ ప్రకాష్,వాసు రెడ్డి, చిన్న, రవి, రజిని, రమేష్, బత్తా రెడ్డి,తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/mla-adimoolam.jpg)