ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాలలో పర్యాటక రంగంగా ఉన్న రామాపురం బీచ్ లో తాగు నీరు, విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు బాపట్ల సూర్యలంక వరకు కనెక్టివిటీ రోడ్డు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తే అభివృద్ధితో పాటు ఆదాయం కుడా మెరుగుపడుతుంది అని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. సోమవారం జరిగిన ఎపి అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీచ్ అభివృద్ధి పై ఎలాంటి దృష్టి సారించలేదని, కనీసం క్లీన్ చేసిన దాఖలాలు కూడా లేవని అన్నారు. బయట నుండి ఎవరైనా చీరాల బీచ్ కు వస్తే తిరిగి వెళతారో లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక బీచ్ లో స్విమర్స్ ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులను చేశామని తెలిపారు. రామాపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఈపూరుపాలెం నుండి మోనటరింగ్ చేయటం కష్టంగా ఉందని చెప్పారు. అక్కడ సమస్యను ఆయన మంత్రి దృష్టికి తెస్తున్నానని అన్నారు. ఈ పాటికే ఒంగోలు నుండి కట్టపూడి వరకు 216 జాతీయ రహదారి ఉందని ప్రస్తుతం పిడుగురాళ్ళ నుండి వాడరేవు వరకు 160 7 ఎ హైవే నిర్మాణం జరుగుతుందన్నారు. అయితేప్రధానంగా తాము కోరేది చీరాల రామాపురం నుండి బాపట్ల సూర్యాలంక వరకు ఈ రహదారికి అనుసంధానం చేస్తూ కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధితో పాటు ఆదాయం, ఉపాధి కుడా లభిస్తుందన్నారు. బ్లూ ఫ్లాగ్ కిందకు రావాలంటే సదుపాయాలు ఉండాలని తెలిపారు. ఈ సదుపాయాలు కల్పిస్తే చీరాల, బాపట్ల మంచి టూరిస్ట్ ప్రాంతం అవుతుందని ఇప్పటికే ఈ ప్రాంతాలకు తెలంగాణ, రాయలసీమ, దూరప్రాంతాల నుండి పర్యాటకులు వస్తున్నారని, ప్రభుత్వం పూర్తిగా మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
రామాపురం బీచ్ అభివృద్ధికి సదుపాయాలు కల్పించాలి : అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య
