ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : విద్యార్థి దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు సాధించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మండలంలోని కొత్తూరు సెంటర్ ప్రభుత్వ హైస్కూల్ లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ అధినేత కృష్ణ పాడిశెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు, నియోజకవర్గ టిడిపి యువ నేత బండారు సంజీవ్ లతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రైట్ చైల్డ్ పౌండేషన్ యాజమాన్యాన్ని అభినందిస్తూ రాష్ట్రం మొత్తం జరగనున్న ఈ కార్యక్రమం మొదటగా ఆలమూరు నుండి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి అంతా టెక్నాలజీ విధానాల పైనే ఆధారపడి ఉందన్నారు. కనుక ప్రతి విద్యార్థి కంప్యూటర్ విద్య ద్వారా పూర్తి శిక్షణ తీసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. 2014 – 19 మధ్య కాలంలో విశాఖను సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేసారని గుర్తు చేశారు. మరలా నేడు అధికారంలోకి రాగానే విశాఖను ఐటీ రంగంలో అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తు తరాలు అంతా సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉండటంతో ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ.రాజు, ఎంఈఓ బి.అప్పాజీ మండల డిసి అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, సర్పంచులు సంగీత సుభాష్, తోట భవాని వెంకటేశ్వర్లు, నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీను, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
