ప్రజాశక్తి-ఏలేశ్వరం (అనంతపురం) : సకాలంలో శివారు పొలాలకు సైతం సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ప్రత్తిపాడు మండలం ఈ గోకవరం వద్ద సుబ్బారెడ్డి సాగర్ నీటి విడుదలను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుబ్బారెడ్డి సాగర్ నీటితో వేములపాలెం, రౌతుపాలెం, పెద్దిపాలెం, పాండవులపాలెం, ఏలూరు, ఒమ్మంగి, పొదురుపాక, ఉత్తర కంచి, లంపకలోవ గ్రామాల పరిధిలోని పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
