ప్రజాశక్తి – సీతంపేట : ఐటిడిఎల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ పథకాలను గిరిజన లబ్ధిదారులు వినియోగించుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ఐటిడిఎలో సిసిడిపి, ఎస్‌సిఎ, టిఎస్‌ఎస్ నిధుల ద్వారా గిరిజన రైతులకు వివిధ రకాల యంత్ర పరికరాలను ఎమ్మెల్యే, పిఒ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తొలుత పిఒ మాట్లాడుతూ ఐటిడిఎ ద్వారా ఇచ్చిన యంత్ర పరికరాలను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని అదే విధంగా గ్రామంలోని ఇతర రైతులకు కూడా ఇవ్వాలని అన్నారు. వీటి ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ యంత్ర పరికరాలు బయట వ్యక్తులకు అమ్మరాదని సూచించారు. వీటిపై ఐటిడిఎ నుంచి పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి యంత్ర పరికరముల పంపిణీ జరగలేదని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ యంత్ర పరికరాల పంపిణీ ప్రారంభించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ పథకాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనులకు పంపిణీ చేసిన యంత్ర పరికరాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వైటిసిల్లో గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తల్లికి వందనం కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం భామిని మండలం ఘనసరానికి చెందిన శ్రీ గౌరీ డ్వాక్రా సంఘానికి రూ.10 లక్షల విలువ గల ఇటుకల తయారీ యూనిట్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే, పిఒ అందించారు. ఈ యూనిట్లో లబ్ధిదారుల వాటా రూ.2 లక్షలు కాగా, మిగిలిన రూ.8 లక్షలు సబ్సిడీ కింద అందించారు. కార్యక్రమంలో ఐటిడిఎ ఎఒ సునీల్, ఐటిడిఎ ఉద్యాన శాఖ అధికారి వెంకట గణేష్, వెలుగు ఎపిడి సన్యాసిరావు, డిపిఎం రమణ, హెచ్‌ఒ జయశ్రీ, ఇతర అధికారులు ఎంపిపి ఆదినారాయణ, జడ్పిటిసి లక్ష్మి, సర్పంచ్ కళావతి స్థానిక ప్రజాప్రతినిధులు సవర తోట మొఖలింగం, సంధ్యారాణి, సోను, మాజీ ఎంపిపి మాలయ్య పవన్ తదితరులు పాల్గొన్నారు.
