బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి

Feb 14,2025 16:08 #Kadapa

ప్రజాశక్తి- పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం  పట్టభద్రుల శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను భోజన నాణ్యత పై, సదుపాయాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం, పప్పు బాగున్నాయని రాంగోపాల్ రెడ్డికి తెలిపారు. కోడిగుడ్డు నాణ్యత పై  విద్యార్థులు ఆయన  దృష్టికి తీసుకురాగా వెంటనే కోడిగుడ్డు బరువును వెయిట్ మిషన్ ద్వారా పరిశీలించారు. 50 గ్రాములు ఉండాల్సిన ఒక్కొక్క కోడిగుడ్డు బరువు 38 నుంచి 40 లోపు ఉండడంతో శాసనమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే అధికారులతో మాట్లాడి దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని, అలాగే గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

➡️