సంస్కారం లేని విద్య ప్రమాదకరం : ఎమ్మెల్సీ

ప్రజాశక్తి – వేంపల్లె సంస్కారం లేని విద్య చాలా ప్రమాదకరమని కాబట్టి ప్రతి విద్యార్థీ నైతిక విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్‌ తులసిరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గండి రోడ్డులో ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి, వ్యక్తిత్వ వికాసకులు షఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు, వెండి, డబ్బు, భూములు, ఇల్లు, స్థలాలు వీటన్నిటికంటే విద్య విలువైన సంపదని అన్నారు. చదువుతో పాటు సంస్కారం అనేది ముఖ్యం అన్నారు. మానవ జీవితంలో విద్యార్థి దశ స్వర్ణ యుగమని దానిని సద్వినియోగం చేసుకుంటే విజేతలు అవుతారని చెప్పారు. నారాయణ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం సంస్కతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నారాయణ పాఠశాల కరస్పాండెంట్‌ నారాయణరెడ్డి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పొన్నతోట గంగాధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, ఉత్తన్న, రమణ, నాగరాజు, వినరు ,టిడిపి నాయకులు జివి రమణ, మైసూరారెడ్డి పాల్గొన్నారు.

➡️