ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న కార్మికులు, నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి ఇసుక విధానంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) కోరింది. భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక సులభంగా సరఫరా అయ్యేలా చూసి కార్మికుల ఉపాధిని కాపాడాలని విన్నవిం చింది. ఈ మేరకు నరసరావుపేటలో సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరైన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు నాయకులు ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎ.ప్రసాదరావు, షేక్ సిలార్ మసూద్ మాట్లాడుతూ సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు శాసనమండలిలో, అసెంబ్లీలో ప్రస్తావించాలని, నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఇసుక కొరతకు పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఇసుక కొరత వల్ల అనేకమంది భవన నిర్మాణ రంగంలో నిర్మాణాలు కుంటుపడి కార్మికులకు పనిలేకుండా పోయిందన్నారు. భవన నిర్మాణరంగంపై ఆధారపడి సిమెంట్, పెయింట్, ఐరన్ షాపుల యజమానులు తమ వాప్యారాలు పడిపోవడంతో తమ వద్ద పనిచేసే కార్మికులకు వేతనాలు సరైన సమయంలో ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. భవన నిర్మాణ రంగాన్ని ఆధారం చేసుకుని నడిచే 40 రకాల పనులు కుంటుపడ్డాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో కె.సురేష్, బి.ఏడుకొండలు, కె.ఆంజనేయులు, ఆర్.ఆంజనేయులు, బి.బాలకోటయ్య, సాల్మన్‌రాజు కోటేశ్వరరావు ఉన్నారు.