ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రాజాంకు చెందిన టిడిపి మహిళా నేత కావలి గ్రీష్మ కు ఎమ్మెల్సీ సీటు వరించింది. ఈ మేరకు ఎమ్మెల్యే కోటాలో టిడిపి ఆమెకు సీటు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. గ్రీష్మ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. సీటు రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందినప్పటికీ, అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ విజయానికి కృషి చేశారు. అధిష్టానం ఆదేశాలకు విధేయురాలుగా పనిచేయడంతో పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోని ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చిందని ఆమె సన్నిహితులు, అభిమానులు చెబుతున్నారు. గ్రీష్మ శాసనసభ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె. తాజా పరిణామాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించిన పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణకు నిరాశే ఎదురైంది.
