మోడీకి ప్రజా ప్రతిఘటన తప్పదు

Mar 16,2025 21:32

ప్రజాశక్తి – కడప అర్బన్‌ సిపిఎం ఎన్నికల సీట్ల సర్దుబాట్లు రాష్ట్రాల వారీగానే ఉంటాయని, బిజెపి వ్యతిరేక విశాల ఐక్యవాదులకు సిపిఎం నాయకత్వం వహిస్తుందని, పరమత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్న మోడీకి ప్రజా ప్రతిఘటన తప్పదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌.కె. నగర్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ విస్తత సమావేశం షేక్‌.గౌసియాబేగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ ఇండియా బ్లాకు కూటమి 2024, దేశ 18వ సార్వత్రిక ఎన్నికలు నాటికి పూర్తయిందని, దాని కొనసాగింపు కార్యక్రమాలు, నిర్మాణం నేడు ఏమీ దేశంలో లేవని తెలిపారు. భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎటువంటి ఎన్నికలలో నైనా సిపిఎం పొత్తులు ఒకే రకంగా ఉండవని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులు బట్టి ఉంటాయని, దేశవ్యాప్తంగా 2025, ఏప్రిల్‌ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో నిర్వహించే 24వ సిపిఎం జాతీయ మహాసభల్లో స్పష్టమైన రాజకీయ విధానం రూపొందించనున్నట్లు చెప్పారు. సిపిఎంకు కేరళలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌ అని, పశ్చిమ బెంగాల్లో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి త్రుణమూల్‌ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. దేశంలో భవిష్యత్‌ కార్యాచరణ సిపిఎం బలం పెంచుకోవడం, విశాల ప్రజా ఐక్యవేదికలు నిర్మాణం, వామపక్ష ఐక్య వేదికలు బలపడడానికి ప్రధాన ఆచరణాత్మక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దేశంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ లు పరమత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేయటం సిపిఎం భవిష్యత్తు కార్యచరణ అన్నారు. ఢిల్లీ ఎన్నికలలో ఇండియా బ్లాక్‌లోని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ తలపడి బిజెపి చేతిలో పెట్టారన్నారు. ఇండియా బ్లాక్‌ ఏర్పడక ముందే బీహార్లో, తమిళనాడులో భావసారుప్యత కలిగిన పార్టీల మధ్య ఐక్య ఫ్రంట్‌ లు ఉన్నాయని గుర్తు చేశారు. మతోన్మాదంపైన, నూతన ఆర్థిక సరళీకరణ విధానాలపైన పోరాడాల్సిన బాధ్యత కమ్యూనిస్టు శ్రేణులపై ఉందని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్‌, బి.మనోహర్‌, వి.అన్వేష్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, పి.చాంద్‌ బాషా, కె.సత్యనారాయణ, కె.శ్రీను, రాహుల్‌, లక్ష్మీదేవి, నాయకులు ఎన్‌.భైరవ ప్రసాద్‌, జి.సునీల్‌కుమార్‌, నరసయ్య, రమణ, సిపిఎం సీనియర్‌ నాయకులు ఐ.ఎన్‌. సుబ్బమ్మ, వివిధ ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️