ప్రజాశక్తి-బొబ్బిలి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా నియోజకవర్గ పరిధిలోని గోతుల రోడ్లకు మోక్షం కలగడం లేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. గోతుల రోడ్లతో తరచూ ప్రమాదాలు సంభవిస్తుండటంతో భయం భయంగా వాహనాలను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. రామభద్రపురం – పార్వతీపురం రాష్ట్రీయ రహదారిపై గొర్లె సీతారాంపురం నుంచి మెట్టవలస సచివాలయం వరకు, శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్ మిల్లు జంక్షన్ నుంచి పాతబొబ్బిలి పెట్రోల్ బంకు జంక్షన్ వరకు రోడ్డు గోతులమయమైంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఏర్పడిన గోతుల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నా రోడ్లు బాగు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని వాహనదారులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి-తెర్లాం రోడ్డుపై ప్రయాణం నరకమేబొబ్బిలి-తెర్లాం రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పారాది వంతెన కుంగడంతో భారీ వాహనాలను బాడంగి, తెర్లాం మీదుగా మళ్లించారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బొబ్బిలి నుంచి తెర్లాం, పినపెంకి నుంచి ఆకులకట్ట, బాడంగి రోడ్లు ఛిద్రమయ్యాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణమంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పూల్‌బాగ్ రోడ్డుపై పెద్దపెద్ద గోతులుబొబ్బిలి మున్సిపాలిటీలోని పూల్‌బాగ్ రోడ్డుకు మోక్షం కలగడం లేదు. ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి దాడితల్లి ఆలయ జంక్షన్ వరకు రోడ్డు గోతులమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఉండడంతో వర్షం కురిస్తే రోడ్డు చెరువును తలపిస్తుంది. ఈ గోతుల్లో భవన నిర్మాణ వ్యర్థాలను వేసి, పూడ్చేశారు. పూల్‌బాగ్ రోడ్డుకు బుడా నిధులు రూ.60 లక్షలు కేటాయిస్తున్నట్లు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ప్రకటించారు. ఆ నిధులు ఎటూ సరిపడే పరిస్థితి లేకపోవడంతో ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి పూల్‌బాగ్ జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రూ.1.03 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం స్పందించి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
