ప్రజాశక్తి – చాపాడు నియోజకవర్గ పరిధిలో అనుమతులు లేని నర్సరీలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. మైదుకూరు, చాపాడు, దువ్వూరు, బి.మఠం, ఖాజీపేట మండల పరిధిలో కుందూ, బ్రహ్మసాగర్ బోరుబావులు, చెరువుల కింద కూరగాయల సాగుకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే అదనుగా చేసుకుని కొంతమంది ప్రభుత్వ అనుమతి లేకుండా నర్సరీలు ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలను రైతులకు అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో వారు ఇష్టానుసారంగా విత్తనాలను సేకరించి సరైన ప్రమాణాలు పాటించకుండా నర్సరీ పెంపకం చేపడుతున్నారు. దీంతో సరైన దిగుబడులు రాక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. నర్సరీ ఏర్పాటు చేసే సమయంలో అనుమతి తీసుకుంటే నాణ్యమైన విత్తనాలు సాగు చేసి మేలురకం మొక్కలను రైతులకు ఇవ్వడమే కాకుండా రసీదులు తప్పక ఇస్తారు. నర్సరీలకు అనుమతులు లేకపోవడంతో రైతులకు రశీదులు ఇవ్వడంలేదు. పంటలు దిగుబడి సరిగా రాకపోయినప్పటికీ రైతులు నర్సరీ యజమానులను ప్రశ్నించ లేని పరిస్థితుల్లో ఉన్నారు. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . మైదుకూరు ప్రాంతం నుండి ఇతర నియోజకవర్గాలకు, జిల్లాలకు కూడా నర్సరీల నుంచి రైతులు మొక్కలు సేకరించుకొని తీసుకు వెళుతున్నారు. ముఖ్యంగా మిరప, టమోటా, చిక్కుడు అనప, బీర తదితర కూరగాయల రకాలను సాగు చేస్తూ రైతులు నష్టాల బారిన పడుతున్నారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 150 నర్సరీ వరకు ఏర్పడ్డాయి. సంబంధిత అధికారులు వద్ద కేవలం 10లోపు మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్త్నుంది. అక్రమంగా వందలాది నర్సరీలు ఏర్పడి కూరగాయలు సాగు చేసే రైతులను నట్టేట ముంచుతున్నారు .ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అనుమతుల్లేని నర్సరీలను తొలగించే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
