కారుమంచి కాలువ పనుల్లో కదలిక

ప్రజాశక్తి-చీమకుర్తి: కారు మంచి కాలువ పునర్నిర్మాణ పనుల్లో కదలిక మొ దలైంది. గత మూడేళ్లుగా మధుకాన్‌ క్వారీలోకి జారిపోయిన కారుమంచి కాలువ కట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టని పరిస్థితి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలువ మరమ్మతులు పనుల వ్యవహారం తిరిగి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ప్రకారం కాలువ మరమ్మతు పనులు చేపడతామని నాయకులు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లూరి ఫౌండేషన్‌ అధినేత, ప్రవాస భారతీయుడు నల్లూరి వెంకట శేషయ్య చొరవ తీసుకొని కాలువ మరమ్మతు పను లపై దష్టి సారించారు. ఇటీవల కారు మంచి కాలువపై దాదాపు రూ.25 లక్షలతో జంగిల్‌ క్లియరెన్స్‌ మరియు కాలువ పూడిక తీత పనులు ఆయన చేయించారు. అంతే గాక కారు మంచి కాలువ షట్టర్లు కూడా సొంత వీధులతోనే చేయించి బిగించారు. ఆయన చొరవ చూపడంతో కాలువ లో పూర్తిస్థాయిలో కాకపోయినా రైతులకు తాగునీరు, సాగునీరు అందటానికి ఎంతగానో ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో ఆయన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్‌ వి జరు కుమార్‌తో కలిసి కాలువపై పర్యటించి పునర్నిర్మాణ దిశగా అడుగులు వేశారు. కాలువ పరిధిలోని రైతులతో కె.వి పాలెంలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఎమ్మె ల్యే బిఎన్‌ విజరు కుమార్‌ మరియు నల్లూరి వెంకట శేష య్య జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కాలువ పునర్మాణ పనులకు రూ.2.60 కోట్లతో డిఎంఎఫ్‌ నిధులు కేటాయించాలని, వేసవికాలంలోనే మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు. కారుమంచి కాలువ కింద 12 గ్రామాల ప్రజలకు, తాగునీరు, సాగునీరు అందుతుందని తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ కాలువను తిరిగి పరిశీలించాలని సాగర్‌ ఎస్‌ఈ వరలక్ష్మిని పురమాయించారు. ఇటీవల సాగర్‌ ఎస్‌ఈ వరలక్ష్మి కారుమంచి కాలువపై అధికారులతో మరియు చీమకుర్తి వాటర్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ పాలడుగు వెంకట్‌ నారాయణలతో కలిసి కాలువను పరిశీలించారు. మధుకాన్‌ క్వారీలోకి దిగి కట్ట జారిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. తగు నివేదికను కలెక్టరుకు అందజేశారు. డిఎంఎఫ్‌ నిధులు మంజూరుపై కలెక్టర్‌ దష్టి సారించడంతో, త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధులు మంజూరు అయితే ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచి కాలువ మరమ్మతులు వేసవి కాలంలోనే పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సాగర్‌ ఎస్‌ఈ వరలక్ష్మి మాట్లాడుతూ కారుమంచి కాలువ మరమ్మతు పనులు వేసవి ముగిసేలోపే పూర్తిచేస్తే, వచ్చే సీజనుకు రైతులకు మరియు తాగునీరుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాలువ పనులపై సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్‌ విజరు కుమార్‌ మరియు నల్లూరి వెంకట శేషయ్య చూపుతున్న చొరవను ఆమె అభినందించారు.

➡️