ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిర్మాణంలో కదలిక

Jun 9,2024 00:05

తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల భవనం
ప్రజాశక్తి – తుళ్లూరు :
అమరావతి రాజధాని పరిధిలోని తుళ్ళూరులో ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు వెనుక వైపు కొద్దిదూరంలో ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిర్మాణ పనులు కొద్దిరోజులుగా జరుగుతున్నాయి. 2017 డిసెంబర్‌ 28న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3 ఎకరాలను కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ రిసోర్సెస్‌ బ్యూరో కార్యాలయం ఉంది. అదే తరహా కార్యాలయాన్ని మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని తలపెట్టారు. 2019 ఎన్నికల్లో టిడిపి అధికారం కోల్పోయి వైసిపి రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడంతో ప్రయోగశాల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ప్రయోగశాల భవనం మందు బాబులకు నిలయంగా మారింది. భవనం పరిసరాలలో పిచ్చిమొక్కలు, కంప చెట్లు పెరిగి అడవిలా తయారైంది. రైతులు, స్థానికుల ఆందోళనతో మూడు నెలల క్రితం పనులు మొదలయ్యాయి. శాస్త్రీయమైన ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిజమైన నేరస్తులను గుర్తించడానికి అవసరమైన ఆధారాలు సేకరించడంలో, దర్యాప్తులో కీలకమైన అంశాలు పసిగట్టడంలో ఫోరెన్సిక్‌ ప్రయోగశాల కీలకం. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్‌ సైన్స్‌ రిసోర్సెస్‌ బ్యూరో ఏర్పాటు చేయాలని టిడిపి ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో నేరాలకు సంబంధించిన అంశాలే కాకుండా దేశంలో ఎలాంటి కేసుకు సంబంధించైనా ఆధారాలు విశ్లేషించేలా ప్రయోగశాలకు రూపకల్పన చేశారు. డిఎన్‌ఎ, సైబర్‌, బయో మెట్రిక్‌, బాలిస్టిక్స్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌కు సంబంధించిన ఆరు ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు, శిక్షణ, పరిశోధన, అభివృద్ధి విభాగాల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రయోగశాల నిర్మాణంతో పోలీస్‌ శాఖతో పాటు సిఐడి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలకు ఉపయోగ కరంగా ఉండే అవకాశం ఉంది. నిధుల లభ్యతకు అవకాశం ఉన్నా వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని తుళ్లూరుకు చెందిన రైతులు కాటా అప్పారావు, నరసింహారావు చెప్పారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక కొంతకాలం పాటు నిర్మాణ పనులు జరిగాయని, మూడు రాజధానులు ప్రకటన తర్వాత పూర్తిగా నిలిపివేశారని వారు చెప్పారు. కొద్దినెలలుగా తిరిగి పనులు మొదలు పెట్టారని, కూటమి అధికారంలోకి రావడంతో పనులు వేగవంతం అవుతాయని భావిస్తున్నామని అన్నారు.

➡️