పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపు

అనకాపల్లి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్యోగులు

ప్రజాశక్తి – యలమంచిలి

యలమంచిలి నియోజకవర్గంలో సోమవారం జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక రాజీవ్‌ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్‌లలో నాలుగు మండలాలకు అవసరమైన ఎన్నికల సామాగ్రి పోలింగ్‌ అధికారులకు అందజేశారు. సుమారు 1500 మందికి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వారిని 72 బస్సుల్లో గమ్య స్థానాలకు చేర్చారు. ఈ బస్సుల్లో 36 ఆర్టీసీవి కాగా, మిగిలినవి ప్రైవేటువని రిటర్నింగ్‌ అధికారి మనోరమ తెలిపారు. లోతట్టు ప్రాంతమైన క్రీడా మైదానంలో వర్షం పడినా నీరు చేరకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తహశీల్దార్‌ అప్పలరాజు తెలియజేశారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు స్థానిక సిఐ గఫూర్‌ తెలియజేశారు. ఏటికొప్పాక, జంపపాలెం, పూడిమడక, కొత్తపట్నం, పిఎన్‌ఆర్‌పేట మొదలైన ప్రాంతాల్లో నిఘా పెంచి డిఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో డిఎస్పీ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు, 12 మంది ఎస్‌ఐలు, 8 మంది సిఐలు, సాయుధబలగాలతో సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. చోడవరం : సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాల పోలింగ్‌ అధికారులు, సిబ్బంది సామాగ్రి చోడవరం ప్రభుత్వ హైస్కూల్‌ క్యాంపు కార్యాలయం నుండి ఆదివారం మండలాలకు తరలివెళ్లారు. చోడవరం బుచ్చయ్యపేట రావికమతం, రోలుగుంట మండలాల్లో 245 పోలింగ్‌ బూతులు ఉన్నాయి. వీటికి సంబంధించి అధికారులు ఎన్నికల సిబ్బంది వాహనాల్లో పోలింగ్‌ సామగ్రితోపాటు తరలి వెళ్లారు. బుచ్చయ్యపేట : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రానికి మండలంలోని 63 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. కె.కోటపాడు : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మండలంలోని 32 పంచాయతీలకు చెందిన 62 పోలింగ్‌ బూత్‌లలో సోమవారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మాడుగుల నియోజకవర్గ కేంద్రం నుండి పోలింగ్‌ అధికారులు ఈవీఎంలతో ఆదివారం సాయంత్రానికే విచ్చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ సందర్శనఅనకాపల్లి : అనకాపల్లి నియోజకవర్గంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి సందర్శించారు. ఈ సందర్భంగా ఈవీఎంల సామాగ్రి పంపిణీ పరిశీలించారు. పోలింగ్‌ సామాగ్రితో సిబ్బంది వివిధ పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పోలింగ్‌ సిబ్బందికి కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి పలు సూచనలు చేశారు.

➡️