విద్యుత్‌ భారాలపై ఉద్యమాలు

Mar 20,2025 00:42

ప్రజాశక్తి-గుంటూరు : ట్రూఅప్‌ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్‌మీటర్ల పేరుతో ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపటానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి అన్నారు. బుధవారం బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జగన్‌ సర్కారుపోయి… బాబు ప్రభుత్వం వచ్చినా… ‘విద్యుత్‌ షాకులు’ టైటిల్‌తో రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతాజి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ప్రజలు వైసిపిని ఓడించి, టిడిపి కూటమిని గెలిపించారని, 9 నెలల కూటమి పాలనలో జగన్‌ విధానాలనే మరింత తీవ్రంగా అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ ఒప్పందాలు, ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చంద్రబాబు, లోకేష్‌, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న అనేక మంది కోర్టుకు వెళ్లారన్నారు. రూ.35 వేల కోట్లు సర్దుబాటు చార్జీల పేరుతో గత ప్రభుత్వం ప్రజలపై భారాలు వేసిందని, అదానితో ఓప్పందాలు కుదుర్చుకొని స్మార్ట్‌ మీటర్లు బిగించి మరింత భారాలు మోపటానికి కారణం అయ్యిందన్నారు. నాటి విధానాలను వ్యతిరేకించిన కూటమి నాయకులు నేడు అవే విధానాలు అనుసరిస్తున్నారని, అదానీతో ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఛార్జీలు తగ్గించకపోగా అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రెండు విడతలుగా ప్రజలపై రూ.15,485 కోట్ల భారం వేసిందన్నారు. అంతేకాకుండా 2024-25 సంవత్సరానికి సంబంధించి సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను సిద్ధం చేసిందన్నారు. అదానితో ఒప్పందంలో అవినీతి జరిగినా ఒప్పందాలను రద్దు చేయటంగానీ, అదానీపై చర్యలు గానీ తీసుకోవట్లేదని తెలిపారు. అదానీతో అనేక దేశాలు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని, ఎపిలో మాత్రం రద్దు కాలేదని అన్నారు. దీనివల్ల రానున్న కాలంలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు భారం ప్రజలపై పడనుందని చెప్పారు. విద్యుత్‌ ఒప్పందాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజలపై భారాలపై సమగ్ర వివరాలతో బుక్‌లెట్‌ రూపొందించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం.రామారావు, ఈమని అప్పారావు పాల్గొన్నారు.

➡️