ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనను టీడీపీ నేతలు రాజకీయం చేశారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వైసిపి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ వస్తున్నారనగానే ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో డిక్లరేషన్ బోర్డులు పెట్టారని ఆయన అన్నారు. జగన్ పర్యటన రద్దు అయ్యిందని తెలియగానే ఆ బోర్డులను తొలగించారని ఎంపీ పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదా? అని ఆయన నిలదీశారు. తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబునాయుడు అపవిత్రమైన కామెంట్స్‌ను నిరసిస్తూ, వైసీపీ పిలుపు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి లో వైసిపి ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ … టీటీడీ అధికారులు తిరుమల స్వామి వారికి సేవ చేస్తున్నారా ? లేక చంద్రబాబుకు చేస్తున్నారా ? అని నిలదీశారు. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన నాయకుల మనసులు కళంకితమై తిరుమల లడ్డూ ప్రసాదంపై అపచార మాటలు మాట్లాడారని ఎంపీ ఆరోపించారు. పాప ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో పూజలు నిర్వహిస్తున్నట్టు ఎంపీ చెప్పుకొచ్చారు. తిరుమల ప్రసాదంపై అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్లందరికీ దేవదేవుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
తిరుమలలో డిక్లరేషన్ బోర్డులతో రాజకీయం చేశారు : ఎంపీ గురుమూర్తి
