చిత్తూరు : చిత్తూరు పార్లమెంటును టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరం రెండవ రాజధానిగా కీర్తి గడించిన చంద్రగిరి కోటను పరిరక్షించి, ఆధునిక యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఢిల్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టిడిపి ఎంపీల బృందం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాద పూర్వకంగా శనివారం కలిశారు. ఏపీలోని గండికోట, రాజమండ్రిలోని హేవలాక్ వంతెన, పుష్కర ఘాట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన నేపథ్యంలో..,కేంద్ర పర్యాటక మంత్రికి పుష్ప గుచ్చం అందించి, కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయల వారికి రెండవ రాజధానిగా పేరొందిన చంద్రగిరి కోటను సంరక్షించడంతో పాటు, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సహరించాలనీ కోరారు. దీనికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించిట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా టిడిపి ఎంపీల బృందం ఢిల్లీలో తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తోందని చెప్పారు. ఏపీని ప్రగతి పథంలో నడిపేందుకు సహకరించాలని కోరుతూ.., తాము ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాల సమర్పించి, విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులు కూడా తమ విజ్ఞప్తులను మన్నిస్తూ.., ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి తమ వంతు సహాయ, సహకారాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పిన్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు.