ఎంఎస్‌ఎంఇ ఉన్నట్లా..లేనట్లా.!

కొప్పర్తి ఎంఎస్‌ఎంఇ పార్కును తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జిఒను ఉపసంహరించుకున్నట్లా..లేనట్లా అనేది తెలియడం లేదు. నార్కోటిక్స్‌డ్రగ్స్‌ కోర్టును తిరుపతికి తరలించడాన్ని కూటమి ఎమ్మెల్యేలను జిల్లా ప్రజానీకం నిలదీస్తోంది. జిల్లా కేంద్రమైన కడపలో స్ట్రోమ్‌వాటర్‌ డ్రెయిన్లు, రాజోలు, జొలదరాశి ప్రాజెక్టులు, అన్నమయ్య పునరుద్ధరణ పనులు చేపడతామనే హామీలు అమలుకు ఆమడదూరంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. జిఎన్‌ఎన్‌ఎస్‌ ఫేజ్‌-2 పనుల పునరుద్ధరణ, కొప్పర్తి పైప్‌లైన్‌, హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు, బుగ్గవంక సుందరీకరణ, సర్వరాయసాగర్‌, బ్రహ్మసాగర్‌ లీకేజీ పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఏడు నెలల కింద ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు శనివారం మైదుకూరు పర్యటన నేపథ్యంలో కథనం… ప్రజాశక్తి – కడప ప్రతినిధి/చాపాడు జిల్లా ప్రగతి తిరోగమనబాట పట్టింది. రాష్ట్రంలో కూటమి సర్కారు రివర్స్‌గేర్‌లో సాగుతోంది. కొప్పర్తికి కేటాయించిన ఎంఎస్‌ ఎంఇఒ నాలెడ్జ్‌ పార్కు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం, ఎన్‌డిఎస్‌పి కోర్టును తరలించడంపై ప్రజాగ్రహం చాపకింద నీరులా సాగు తోంది. జిల్లాకు కొత్తగా పరిశ్రమలు ఇవ్వకపోయినా ఉన్న సంస్థలను వాటిని తరలించడం ఏమిటనే వాదన వినిపిస్తోంది. చెన్నూరు సుగర్‌ పరిశ్రమ పునరు ద్ధరణ, జెఎస్‌డబ్య్లూ కంపెనీ ఉక్కు పరిశ్రమ, జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 పనుల్లో ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు. 2007లో వైఎస్‌ఆర్‌ సర్కారు హయాం లో రూ.72 కోట్లతో కడపలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ కోల్డ్‌స్టోరేజీకి పరిమితమైంది. ఫలితంగా వర్షాకాలంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునకలు వేస్తుండడం పరిపాటిగా మారింది. రూ.70 కోట్ల విలువైన స్ట్రోమ్‌ డ్రెయిన్‌ల ఏర్పాటు హామీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఏటా కురుస్తున్న వర్షాల ధాటికి కడప నగరం మునుగుతోంది. స్ట్రోమ్‌డ్రెయిన్‌ కాల్వల ఆక్రమణలను తొలగించి విస్తరణ పనులు చేపట్టడానికి ఇచ్చిన హామీ ఓ మూలకు పరిమితమైంది.అద్దెగదుల్లోనే ఆర్కిటెక్షర్‌ చదువులు రూ.345 కోట్లతో కూడిన ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ అద్దె గదుల్లోనే కాలం గడుపుతోంది. ఐదేళ్లుగా స్థలం ఎంపిక, శంకుస్థాపన దశకే పరిమితమైంది. ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ నిర్మాణం ఎప్పటికి సాకారమవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. రూ.12కోట్లతో కూడిన హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు.కొప్పర్తి పైప్‌లైన్‌ ప్రశ్నార్థకమే! రూ.150 కోట్ల కొప్పర్తి పైప్‌లైన్‌ సాకారానికి నోచుకోవడం లేదు. నీటి కొరత, పర్యావరణ అనుమతుల కారణంగా పారిశ్రామిక పురోగతి పడకేసిం ది. కొప్పర్తిలోని వైఎస్‌ఆర్‌ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన పరిశ్రమల అవసరాలకు సరిపడా నీటి సదుపాయం అందడం లేదు. కడప, ప్రొద్దుటూరు పాల పరిశ్రమల కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రొద్దుటూరులో మూలన పడిన పాలపరిశ్రమ ఆస్తుల తనఖా పెట్టిన నేపథ్యంలో సుమారు రూ.90 కోట్లు చెల్లింపులకు నోచుకోకపోవడం లేదు. రూ.12 కోట్లతో కూడిన బుగ్గవంక బ్యూటిఫికేషన్‌, లైటింగ్‌ సిస్టమ్‌ పనులకు మోక్షమెప్పుడో తెలియడం లేదు.పడకేసిన ప్రాజెక్టులు జిల్లాలోని ప్రాజెక్టు పనుల పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 పనులకు కదలిక ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. 2014 ఫిబ్రవరిలో ఫేజ్‌-2 పనులకు పిలిచిన టెండర్లు రద్దుకు గురైనప్పటి నుంచి ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఫేజ్‌-1లో భాగమైన సర్వరాయసాగర్‌, వామికొండ రిజర్వాయర్లు ఎప్పటికి సాకారమవు తాయో తెలియడం లేదు. జిల్లా నీటిపారుదలశాఖ రూ.212 కోట్ల ప్రతి పాదనల అనుమతుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రూ.82 కోట్లతో కూడిన మైలవరం రిజర్వాయర్‌ ఆధునీకరణ ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. అన్నమయ్య రిజర్వాయర్‌ పునురుద్ధరణ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు.అందని పరిహారంఅన్నమయ్య, గండికోట, ఎన్‌హెచ్‌ నిర్వాసితులకు వేదన తప్పడం లేదు. గ్రీవెన్స్‌సెల్‌, స్పందన, ప్రజాసమస్యల పరిష్కార వేదికల చుట్టూ తిరుగుతున్నప్పకీ పరిష్కారం కావడం లేదు. అన్నమయ్య రిజర్వాయర్‌ పునరుద్ధరణ ఎప్పటికి సాకారమవుతుందో తెలియడం లేదు. రెండేళ్ల కిందట అన్నమయ్య రిజర్వాయర్‌ గల్లంతైన ఘటనలో నష్టపోయిన వారికి ఎటువంటి న్యాయమూ జరగలేదు. ఐదు సెంట్లలో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలులో నిర్లక్ష్యం నెలకొంది. గండికోట నిర్వాసితులకు అదనపు పరిహారం కింద రూ.3.25 లక్షలు ఇస్తామన్న హామీ కాగితాలకే పరిమి తమైంది.రాయచోటి-వేంపల్లి-చాగలమర్రి, బెంగళూరు-విజయవాడ జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు కోల్పోయిన నిర్వాసితులకు వెతలు తప్పడం లేదు.ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ ఖరారు స్వచ్ఛాంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మైదుకూరు పర్యటన ఖరారైంది. విజయవాడలో ఆయన ప్రారంభమైనప్పటి నుండి తిరిగి వెళ్లేంత వరకూ షెడ్యూల్‌ను సిఎం ఫేషి అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు ఆయన ఇంటి నుండి బయలుదేరి 11 గంటలకు విజయవాడ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకొని 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. అక్కడ నుండి హెలికాప్టర్‌ ద్వారా 12.10 గంటలకు మైదుకూరు కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 12.20కి స్థానిక కెఎసి కల్యాణ మండ పంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అక్కడే విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 1 నుంచి 1.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుని, 1.55కు బయలుదేరి ప్రొద్దుటూరు రోడ్డులోని వినాయకనగర్‌లోని గహ సంద ర్శన నిర్వహించనున్నారు. 2.15 నుంచి స్వేచ్ఛాంధ్ర వాక్‌ నిర్వహించనున్నారు. 2.45కు పారిశుధ్య వాహనాలను జండా ఊపి ప్రారంభిస్తారు. 3 గంటలకు స్టాల్స్‌ సందర్శన, స్వచ్ఛఆంధ్రలో భాగంగా ఏర్పాటు చేయనున్న వివిధ కార్యక్ర మాలను ప్రారంభించనున్నారు. 4 గంటలకు హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. 4.30కు హెలిప్యాడ్‌కు చేరుకొని కడపకు బయలుదేరి ,4.50 నుంచి కడప ఎయిర్పోర్ట్‌ నుంచి విజయ వాడకు వెళ్ళనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అందుకు సంబంధించి కలెక్టర్‌ శ్రీధర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అతిథి సింగ్‌, ఎస్‌పి విద్యాసాగర్‌ నాయుడు, జిల్లా అధికారులు, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనువాసులరెడ్డి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ప్రోగ్రాం కమిటీ చైర్మన్‌ వెంకటేష్‌, ముఖ్య నాయకులు ధనపాల జగన్‌, దాసరి బాబు, భీమయ్య, మునిశేఖర్‌రెడ్డి, గురివిరెడ్డి, మిల్లు శ్రీను, ఎపిరవీంద్ర, కిషోర్‌ కుమార్‌ రెడ్డి, జయభారత్‌ రెడ్డి, చిన్నా, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

➡️