ఆప్కాస్‌ ఉద్యోగులకు ఎంటిఎస్‌ విధానం అమలు చేయాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఆప్కాస్‌ ఉద్యోగులకు ఎంటిఎస్‌ విధానం అమలు చేయాలని ఆప్కాస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట ఆప్కాస్‌ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ 1994 నుంచి అవుట్‌ సోర్సింగ్‌, తర్వాత ఆప్కాస్‌ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. టిడిపి, వైసిపి అధికారంలోకి వస్తే ఆప్కాస్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు చేసిన పాపాన పోలేదని చెప్పారు. గత ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను మోసం చేసి ఆప్కాస్‌ విధానంలోకి మార్పు చేసిందే తప్ప వారికి ఏమాత్రం మేలు చేయలేదని విమర్శించారు. మేలు జరగకపోగా కీడు ఎక్కువే చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పిఆర్‌సి పెరిగే సమయంలో అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు 75, 80 శాతం వేతనాలు పెరిగేవని చెప్పారు. గత ప్రభుత్వం పుణ్యమా అని 23శాతం మాత్రమే వేతనాలు పెరిగాయని చెప్పారు. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలంటే, ఆప్కాస్‌ కార్మికులకు లబ్ధి చేకూరాలంటే ఎంటిఎస్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. గతంలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు పెద్ద వ్యత్యాసం ఉండేది కాదని పేర్కొన్నారు. వందల్లో మాత్రమే వ్యత్యాసం ఉండేదని, ఇప్పుడు చూస్తే వేళల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. ఆప్కాస్‌ కార్మికులను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి వారిని సర్వీసును బట్టి పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిజిహెచ్‌ ఆప్కాస్‌ యూనియన్‌ కోశాధికారి బాలాజీ రావు, ఉపాధ్యక్షులు భాస్కర్‌, ఏసన్న, కార్యదర్శులు కొండయ్య, చెన్నయ్య, కమిటీ సభ్యులు జయసుధ, మరియమ్మ, ఆప్కాస్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️