ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ వారంతా సామాన్య రైతులు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. అనాదిగా భూములనే నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రాణాలు. వారి జీవనాధారమైన వ్యవసాయ భూములను ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వానికి అప్పజెప్పి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తూ కాలం వెల్లదీస్తున్నారు. వారే ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ బాధితులు. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట, బి.కొత్తకోట మండల పరిధిలో రూ.759.50 కోట్ల అంచనాతో గత ప్రభుత్వం 2021-22లో పిచ్చలవాండ్లపల్లి పంచాయతీ పరిధిలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను 1.96 టిఎంసిల నీటి సామర్థ్యంతో నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందుకుగాను 300 మంది రైతుల నుంచి సుమారు వెయ్యి ఎకరాలకుపైగా సారవంతమైన వ్యవసాయ భూములను పోగేసింది. ఆ సమయంలో ఎకరాకు రూ.12.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని, నష్టపరిహారం అందే వరకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు చొప్పున గుత్త చెల్లిస్తామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వ్యవసాయ భూములతో పాటు గ్రామాలు, చెరువులు, కుంటలను తీసుకున్నారు. ఈ క్రమంలో కురబలకోట మండలంలోని పిచ్చలవాండ్లపల్లి పంచాయతీలో 796.7 ఎకరాలు, కురబలకోట పంచాయతీలో 66.70 ఎకరాలు, ముదివేడు పంచాయతీలో 64.95 ఎకరాలు, బి.కొత్తకోట మండలంలోని కోటావూరు పంచాయతీలో 146.05 ఎకరాలు ఎంపిక చేసి ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించడంతో ప్రాజెక్టు పనులను అర్ధాంతరంగా ఆపేశారు. ప్రాజెక్టు పనులు ఆగిపోవడం, వెనువెంటనే సార్వత్రిక ఎన్నికలు రావడం చకచకా జరిగిపోయాయి. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ 300 పేద రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు. కట్ట నిర్మాణానికి అవసరమైన మట్టిని రైతులకు చెందిన 400 ఎకరాల వ్యవసాయ భూముల నుంచి మట్టిని తరలించారు. ఏడాదికి రెండు, మూడు పంటలు పండే ఆ భూములు సారవంతాన్ని కోల్పోయి వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయి. పునరావాస కల్పనలోనూ తీవ్ర నిర్లక్ష్యం ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తి అయితే కురబలకోట మండలం, పిచ్చలవాండ్లపల్లి పంచా యతీలోని శీతివారిపల్లి, కొత్తపల్లి, బి.కొత్తకోట మండలం, కోటూరు పంచాయతీలోని చౌటకుంటపల్లి, దిన్నమీద గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పిచ్చలవాండ్లపల్లి పంచాయతీలో 204 కుటుంబాలు, కోటావూరు పంచాయతీలో 125 కుటుంబాలను పునరావాసం కోసం ఎంపిక చేసి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందజేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్థలాలను ఎంపిక చేసి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆ ప్రకారం పిచ్చలవాండ్లపల్లి పంచాయతీలోని భూ నిర్వాసితులకు ముదివేడు క్రాస్ సమీపంలోని తానామిట్ట వద్ద 21.50 ఎకరాలు, బి.కొత్తకోట మండలంలోని కోటావూరు నిర్వాసితుల కోసం 13.5 ఎకరాలు ఎంపిక చేసింది. ఒక్కో కుటుంబానికి గ హ నిర్మాణం కోసం 5సెంట్ల స్థలాన్ని ఇవ్వడంతో పాటు, అక్కడ అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకునేవారికి వారికి రూ.10 లక్షల ఆర్థికసాయం, అలా నిర్మించుకోలేని వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు మిగిలిన పైకాన్ని వారికే అందజేస్తామన్నారు. ప్రాజెక్టు చేపట్టి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. రాజకీయ క్రీనీడలో రైతులే బలి పశువులు గత వైసిపి ప్రభుత్వంలో 2021-22లో ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులకు ఇష్టం లేకపోయినా భూములను అప్పగించాల్సి వచ్చింది. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ప్రాజెక్టు నిర్మాణమే నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కొంతమంది టిడిపి సానుభూతిపరులు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి పనులను ఆపు చేయించారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రాజెక్టును ప్రారంభించిన వైసిపి ఘోరంగా ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. తమ హయాంలో ప్రాజెక్టు చేపట్టలేదన్న ఉద్దేశమో, లేక మరే కారణం చేతనో కానీ ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తవుతున్నా కనీసం ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడాన్ని చూస్తుంటే రాజకీయ క్రీనీడలో బలి పశువులైంది మాత్రం పేద రైతులేననేది సుస్పష్టంగా తెలుస్తోంది. కలెక్టర్ స్పందించి దగాపడ్డ బాధిత రైతులను ఆదుకోవాల్సి ఉంది.