ప్రజాశక్తి-రాయచోటి టౌన్ ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం ముదివేడు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ముదివేడు రిజర్వాయర్ నిర్మించాలని తలపెట్టి అనేక అవకతవకలకు పాల్పడి రైతులను ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పోరాటం ఫలితంగా ముంపునకు గురయ్యే భూములను, ఇళ్లను గుర్తించడం కోసం ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి, అవార్డు కూడా ప్రకటించిందని గుర్తుచేశారు. దాదాపు 780 ఎకరాల భూములకు రూ. 108 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ప్రకటించినా అమలుకు నోచుకోలేదన్నారు. కూరబలకోట, బి.కొత్తకోట మండలాల పరిధిలోని ఐదు గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయని ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారు. భూముల్లో మట్టిని తవ్వేసిన కారణంగా వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయాని, రిజర్వాయర్ నిర్మాణ సంస్థ రైతులకు లీజు చెల్లిస్తామని చెప్పి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదివేడు రిజర్యాయిర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, భూములు,ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ 5 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డికెటి పరిహారం ఇవ్యాలని, భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ. 5లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని పేర్కొన్నాపరు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేయని పక్షంలో ఉద్యమం ఉదతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్‌కు వినతిపత్రం అందచేశారు. సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పందికాళ్ళ మణి, ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల సంఘం నాయకులు సురేంద్రరెడ్డి, ముక్తుమ్ బాషా, ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.