ప్రజాశక్తి-కాకినాడ : 1999లో కాకినాడ ఎంపీగా పునర్జన్మిచ్చిన సీఎం చంద్రబాబును, 30 కోట్ల రూపాయల సొంత నిధులను కౌలు రైతులకు పరిహారం అందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను విమర్శించే స్థాయి ముద్రగడకు లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తీరుపై ఉభయ తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోకేడ రాంబాబు ధ్వజమెత్తారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడకు కాపు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే హక్కు ఎక్కడిది అంటూ రాంబాబు విమర్శించారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ముద్రగడ కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మాట్లాడిన తీరును నిరసిస్తూ గోకేడ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ మాట్లాడే తీరుకు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. ఆయనతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు, వైయస్ రాష్ట్ర స్థాయిలో ఎలా ఎదిగారో ఆయన తెలుసుకోవాలన్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరే ఆయన పాతాళంలోకి పోవడం కారణమంటూ ముద్రగడను విమర్శించారు. 2009 నుంచి 2024 వరకు కాపులకు ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన జగన్ తీరుపై ఏనాడు మాట్లాడకుండా నిమ్మకుండి పోయారన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానంటే మద్దతు ఇవ్వకుండా అతన్ని ఓడించి పేరు మార్చుకుంటానంటూ శపధం వెనుక కారణాలు ఏంటో బయటకు చెప్పాలన్నారు. ప్రత్తిపాడు, జగ్గంపేటలలో పోటీ చేయకుండా 2009లో ముద్రగడ పిఠాపురం నుండి పోటీ చేస్తే అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించిన సంఘటనను గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లు అంశంపై చంద్రబాబునే ఆయన లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని అంత ముందు జగన్ హయాంలో కాపు రిజర్వేషన్ల విషయాన్ని ఎందుకు మాట్లాడలేదో వెనుక మర్మాన్ని తెలియజేయాలని ముద్రగడను రాంబాబు డిమాండ్ చేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు రుణాలు, విదేశీ విద్యను అందించారని అలాగే ఐదు శాతం ఇడబ్ల్యూఎస్ వాటాగా కేంద్రాన్ని కూడా పంపిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా కాపులకు మేలు చేసిన చంద్రబాబును కాకుండా అన్యాయం చేసిన జగన్ వైపు ముద్రగడ ఎందుకు పని చేశారో చెప్పాలన్నారు. అతను మాత్రమే ఉన్నత స్థాయిలో ఉండాలని మిగిలిన కాపు నాయకులు నాశనం అవ్వాలని కోరుకునే మనస్తత్వం గల వ్యక్తి ముద్రగడ అని అన్నారు. అతని తీరు వల్ల తునిలో రైలు దహనం అయిందని దానికి ఎంతోమంది కాపు యువత ఇబ్బందులకు గురి అయ్యారని గోకేడ చెప్పారు. ఇప్పటికైనా ముద్రగడ రెడ్డి కులంగా మార్చుకున్నారని ఇక కాపు కులం గురించి మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. తాము కాపు సంక్షేమ సంఘం తరఫున 2012 సంవత్సరంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ సభ నిర్వహించామని దాని ఆధారంగానే చంద్రబాబు పలు సంక్షేమ కార్యక్రమాలను కాపుల అభివఅద్ధి కోసం చేశారన్నారు ఇప్పటికైనా చంద్రబాబు, పవన్లపై విమర్శలు మానుకోవాలని లేనిపక్షంలో ముద్రగడ పద్మనాభ రెడ్డికి బుద్ధి చెబుతామంటూ గోకేడ హెచ్చరించారు. అనంతరం కాపు రిజర్వేషన్లపై ముద్రగడ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా కాపు యువత నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాపు యువత ముమ్మిడి విష్ణు, నాగుమళ్ళ బెనర్జీ, పెద్దిరెడ్డి ఆదిత్య, అడపా అర్జున్, దారపురెడ్డి కిషోర్, పసుపులేటి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
రెడ్డిగా మార్చుకున్న ముద్రగడకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు : ఉభయ తూ.గో జిల్లా కాపు సంక్షేమ సంఘం
