ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : మున్సిపల్ పారిశుధ్య పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించి, సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బివి రమణ డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 17 రోజుల సమ్మె కాలంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ సమయంలో గ్రాడ్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు పిఆర్‌సి అమలు చేయాలని, డిఎలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు మున్సిపల్ కార్మికుల సేవలను కొనియాడుతూనే వారికి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన సదుపాయాలను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అవసరమైన గ్లౌజులు, సబ్బులు, చెప్పులు, పనిముట్లు, చెత్త సేకరణ బండ్లు నేటికీ పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని చెప్పారు. ఇప్పటికే రిటైరైన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, అనారోగ్యానికి గురైన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆప్కోస్‌లో తప్పుగా నమోదైన వారి వయస్సు సవరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం శానిటరీ ఇన్‌స్పెక్టర్ పకీర్‌రాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి.ఇందిర, బి.సూరిబాబు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగవంశం శంకరరావు, చీపురుపల్లి సింహాచలం, బంగారు రవి, గండేటి గంగరాజు, నాగవంశం మల్లేష్, నాగవంశం నిర్మల, మామిడి శివ, తదితరులు పాల్గొన్నారు.
