ప్రజాశక్తి – రాయచోటి టౌన్ ఆప్కాస్‌లో ఉన్న మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని గ్రాట్యుటీ వర్తించదంటూ రాష్ట్ర మునిసిపల్ పరిపాలన పట్టణాభివద్ధి శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆప్కాస్ అనే సంస్థ ప్రభుత్వ అధికారుల ఆధీనంలో నడుస్తున్న సంస్థ అని అవుట్ సోర్సింగ్ ఏజన్సీల కోసం ఏర్పాటు చేసినట్లు సాంకేతిక కారణాలను సాకుగా చూపి చట్టబద్ధంగా అమలు కావాల్సిన గ్రాట్యుటీ పథకం నిరాకరించడం ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులైతే గ్రాట్యుటీ వర్తిస్తుందనే అర్థంలో ప్రభుత్వం చెప్పడం అవివేకంతో కూడుకున్న చర్య అన్నారు. యజమాని, కార్మికుడు సంబంధం ఉన్న ప్రతి సంస్థలోనూ ఉద్యోగులు, కార్మికులు ఎవరికైనా గ్రాట్యూటీ వర్తిస్తుందని తెలిపారు. అనంతరం మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు బీవీ రమణ,చెన్నయ్య, రాంబాబు మాట్లాడుతూ టిఎల్‌ఎఫ్‌లోని 8 నెలల పెండింగ్ పిఎఫ బకాయిలు ఇవ్వాలని, డ్రైవర్లకు 36 జిఒఅమలు చేసి రూ. 24500 వేతనం ఇవ్వాలన్నారు. ఆప్కాస్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కాదని ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం గత నాలుగేళ్లుగా 60 ఏళ్లు నిండిన వారిని ఉద్యోగాల నుండి బలవంతంగా విరమణ చేయించారని అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ఆప్కాస్ ప్రారంభించినా ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వ అడుగుల్లోనే అడుగులు వేస్తూ గత 9 నెలలలో వందలాది మందిని 60 ఏళ్లు నిండాయనే సాకుతో ఉద్యోగాల నుంచి బలవంతంగా రిటైర్మెంట్ చేయిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పద్ధతుల్లో జారీ చేసిన సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించి మునిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికులందరికీ గత 17 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిన ఒప్పందం మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో కూడిన విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
