సమస్యలు పరిష్కరించనందుకే మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Mar 10,2025 21:31

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్నోసార్లు మున్సిపల్‌ కమిషనర్‌కు, చైర్‌పర్సన్‌కు స్థానిక మంత్రి సంధ్యారాణికి వినతి పత్రాల ద్వారా విన్నవించుకున్నా నేటికీ వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కారణంగానే సోమవారం నుండి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు మున్సిపల్‌ కార్మిక వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు టి శంకర్రావు, రాముడు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది నెలల నుంచి మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న కనీస అవసరాలను తీర్చాలని కోరుతూ మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌ సత్యనారాయణకు,మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామన్నారు. పాలకవర్గ సమావేశాలను కూడా అడ్డగించి డిమాండ్‌ చేసినా వాటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెబుతూ నేటి వరకు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నందున ఈ సమ్మె నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మున్సిపల్‌ కార్మికులకు బకాయి జీతాలను ఇప్పించాలని, ప్రతినెలా ఒకటో తారీకున జీతాలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఫిబ్రవరి నెల జీతాలను వేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నా వీటిని పరిష్కరించడంలేదన్నారు. మంత్రి సంధ్యారాణి సొంత నిధులు ఇస్తామని, కార్మికుల కనీస అవసరాలైన సబ్బులు, నూనెలు, చెప్పులు నేటి వరకు కార్మికులకు అందించలేదని, మంత్రి కూడా మాట తప్పారని అన్నారు. తమ పరిష్కరించాలని కోరుతూనే ఈ సమ్మెను నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌వై నాయుడు, కార్మికులు పాల్గొన్నారు.

➡️