రేపు మున్సిపల్‌ కార్మికుల నిరసన దీక్ష

Jan 8,2025 21:24

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : 2023 డిసెంబర్‌ 26 నుంచి జనవరి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వంతో జరిగిన రాతపూర్వక ఒప్పందాలకు తక్షణమే జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 10న విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ .జగన్మోహన్‌రావు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మున్సిపల్‌ మస్టర్‌ పాయింట్ల వద్ద కార్మికులను కలిసి కరపత్ర ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థలో 60 సంవత్సరాలు దాటి అనేక కారణాలతో 12 మందిని రిటైర్మెంట్‌ చేశారని, మరో 20 మంది అనారోగ్యంతో మరణించారని, వారి కుటుంబంలో ఉపాధి కల్పించకుండా ఉన్న కార్మికుల పైనే పని భారం పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులకు ఆయన పని చేసిన కాలానికి గ్రాట్యూటీ లెక్క కట్టి చెల్లిస్తున్నారని, ప్రభుత్వ సంస్థలో అందునా మున్సిపల్‌ ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేసి తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న కార్మికులకి ఎలాంటి భద్రత, భరోసా కల్పించకుండా తొలగించడం ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కల్పించలేక పోతే ప్రభుత్వ ఉద్యోగి మాదిరి అందర్నీ 62 ఏళ్ల వరకు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీవో నెంబర్‌ 2ను సవరించి కాంట్రాక్ట్‌ ,ఔట్‌ సోర్సింగ్‌ ,డైలీ వేజ్‌ కార్మికులందరికీ మినిమం టైం స్కేల్‌ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ ఉద్యోగుల కార్మికుల మూడు సంవత్సరాల సరెండర్‌ లీవ్‌ డబ్బులు , డిఎ బకాయిలు చెల్లించాలని ,జిపిఎస్‌ అకౌంట్లు తెరవాలని , మట్టి ఖర్చులు, ఎక్స్‌గ్రేషియో పెంపు జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నిరసన దీక్ష చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్‌ కార్మికులు ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు శంకర్రావు, ఈశ్వరమ్మ, కుమారి, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️