ప్రజాశక్తి -పూసపాటి రేగ : భారత రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్ కు నివాళి అని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు అన్నారు. ఆయన ఆశయాలు సాధించాలంటే రాజ్యాంగం స్ఫూర్తిని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కెవిపిఎస్ నాయకులు తాలాడ బుజ్జిబాబు అధ్యక్షతన పేరాపురం గ్రామంలో సోమవారం సభ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిట్టిబాబు మాట్డాడుతూ వివక్షత లేని సమాజం భారత రాజ్యాంగం ద్వారా సాధించాలని అంబేద్కర్ ఆశించారని, కానీ నేటికీ అంటరానితనం , అసమానతలు, కుల వివక్షత , మతోన్మాదం, ఆహారంపై ఆంక్షలు వంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు చూస్తుంటే భారత ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని స్ఫూర్తిని తుంగలోనికి తొక్కుతోందన్నారు. డాక్టర్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ మహిళల హక్కులు కోసం కృషి చేశారని, రాజ్యాంగంలో వారికి ప్రత్యేక హక్కులు కల్పించారని తెలిపారపు. పూసపాటిరేగ ఎస్‌ఐ ఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపు మాపేందుకు అంబేద్కర్ పోరాడారని అన్నారు. సిఐటియు నాయకులు బి.సూర్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. స్థానిక సర్పంచ్ రౌత్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ నేటి యువతకు అంబేద్కర్ జీవితం ఆదర్శం కావాలన్నారు. అనంతరం ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, రాజ్యాంగ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో పేరాపురం ఎపిటిసి పతివాడ తమ్ము నాయుడు, పూసపాటిరేగ సర్పంచ్ సీతారాములు, పేరాపురం మాజీ సర్పంచ్ బొంతు ఉమ, వైసిపి నాయకఁలు కోరాడ మహేష్, జనసేన నాయకఁలు బోర సతీష్, యువజన సంఘం నాయకులు తాలాడ కృష్ణ, మురళి, గణేష్, తవుడు పాల్గొన్నారు.
