మోస్ట్‌ వాంటెండ్‌ థార్‌ గ్యాంగ్‌ అరెస్టు

మధ్యప్రదేశ్‌ వెళ్లి జల్లెడపట్టిన ‘అనంత’ పోలీసులు
 రూ.90 లక్షల బంగారు, వజ్రాభరణాలు, రూ.19.35 లక్షల నగదు స్వాధీనం
 గ్యాంగ్‌ లీడర్‌పై దక్షిణ భారత దేశంలో 32కు పైగా కేసులు
ప్రజాశక్తి-అనంతపురం క్రైం : అనంతపురం నగరంలోని శ్రీనగర్‌ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్‌ హోమ్స్‌లోని మూడు విల్లాల్లో జరిగిన చోరీ కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన థార్‌ గ్యాంగ్‌ ఈ చోరీలకు పాల్పడినట్లు తేల్చారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.90 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, రూ.19.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురిలో గ్యాంగ్‌ లీడర్‌పై ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 32 కేసులు నమోదయ్యాయి. ఆదివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పి పి.జగదీష్‌ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురంలోని శ్రీనగర్‌ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్‌ హోమ్స్‌లోని శివారెడ్డి, రంజిత్‌ రెడ్డి, శివశంకర్‌ నాయుడు ఇళ్లల్లో గత నెల 22న చోరీలు జరిగాయి. ఇళ్లకు తాళం వేసి ఉండడంతో ఎవరూ లేనిసమయంలో దొంగలు చొరబడి సుమారు రూ.2.13 కోట్లు విలువైన బంగారు, వజ్రాభరణాలు, నగదు దొంగిలించారు. ఈ కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక నాల్గో పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్‌పి పి.జగదీష్‌ నాలుగు పోలీసు బృందాలను రంగంలోకి దించి మధ్యప్రదేశ్‌ మారుమూల గ్రామాల్లో సైతం జల్లెడ పట్టించారు. చోరీకి పాల్పడిన వారిలో ముగ్గురు తాము దోచుకున్న సొమ్మును స్థానిక రాయల్‌ నగర్‌లో ఆదివారం అమ్మకానికి బేరం చేసుకుంటుండగా జిల్లా ఎస్‌పికి సమాచారం అందింది. అనంతపురం అర్బన్‌ డిఎస్‌పి వి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిఐలు కనుమూరి సాయినాథ్‌, హేమంత్‌ కుమార్‌, జయపాల్‌ రెడ్డి, ఎస్‌ఐలు రాంప్రసాద్‌, రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందంగా ఏర్పడి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం థార్‌ జిల్లా చడ్‌వాడు గ్రామానికి చెందిన నారుపచావర్‌, సావన్‌ అలియాస్‌ శాంతియదుడ్యే, పిపాల్డిల్యా గ్రామానికి చెందిన సునీల్‌లను ఉన్నారు. గ్యాంగ్‌లోని మహబత్‌, మోట్ల పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు, వజ్రాభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో థార్‌ గ్యాంగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా ఉంది. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురు, పరారీలో ఉన్న ఇద్దరితో పాటు సుమారు 60 మంది ఈ గ్యాంగ్‌లో ఉన్నారు. అయితే, ఐదారుగురు కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి చోరీలు చేస్తారు. వీరంతా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం థార్‌ జిల్లా టాండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు చెందిన వారు. వీరు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని, డబ్బు సులువుగా సంపాదించడానికి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. థార్‌ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన ప్రత్యేక బృందాన్ని ఎస్‌ఫి అభినందించారు.

➡️