ఆసక్తికరంగా నందికొట్కూరు రాజకీయం

Feb 12,2024 21:15

నందికొట్కూరు అసెంబ్లీ చిత్రం

ఆసక్తికరంగా నందికొట్కూరు రాజకీయం
– వైసిపి అభ్యర్థిగా డాక్టర్‌ దారా సుధీర్‌
– టిడిపిలో తేలని అభ్యర్థి
– సిట్టింగు ఎమ్మెల్యే వైసిపిలోనే కొనసాగుతారా..?
ప్రజాశక్తి-పాములపాడు/నందికొట్కూరు టౌన్‌
నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించడంలో అధికార పార్టీ ముందుంది. టిడిపి కూడా ఒక అభ్యర్థి పేరుతో ప్రచారం చేస్తున్నా అధికారికంగా ప్రకటించ లేదు. ఈసారి కాంగ్రెస్‌ కూడా పోటీ చేస్తుందనే చర్చ నడుస్తుంది. నిరంతరం ప్రజల పక్షాన ఉండే వామపక్ష పార్టీల ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నందికొట్కూరు నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్‌లో ఎస్‌సిలకు రిజర్వు అయింది. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుండి లబ్బి వెంకటస్వామి పోటీ చేయడంతో టిడిపి నుండి బిచ్చన్న పోటీ చేశారు. బిచ్చన్నపై లబ్బి వెంకటస్వామి గెలుపొందారు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో లబ్బి వెంకటస్వామి టిడిపి నుండి పోటీ చేశారు. వైసిపి నుంచి ఐజయ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఐజయ్యను మార్చి ఆర్థర్‌కు సీటు ఇచ్చారు. టిడిపి బండి జయరాజుకు సీటు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆర్థర్‌ గెలిచారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌కు సీటు ఇవ్వకుండా డాక్టర్‌ దార సుధీర్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసిపి ప్రకటించింది. టిడిపి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అధికార, ప్రతిపక్షపార్టీలు ఎస్‌సి నియోజకవర్గంలో ప్రతిసారి అభ్యర్థులను మార్పు చేస్తున్నారు. ఇది వరకు జరిగిన ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌కు, రెండు సార్లు వైసిపికి నందికొట్కూరు ప్రజలు పట్టం కట్టారు. 2014లో లబ్బి వెంకటస్వామి టిడిపి నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో వైసిపి సీటు కోసం ప్రయత్నం చేశారు. ఆ పార్టీ ఊహించని రీతిలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపింది. 2019లో ఐజయ్యకు వైసిపి సీటు దక్కకపోవడంతో టిడిపిలో చేరారు. టిడిపి అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ వైసిపిలోకి వచ్చారు. ఐజయ్య కుమారుడు చంద్రమౌళి 2024 వైసిపి ఎమ్మెల్యే సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. ఫలితం దక్కలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్‌కు సీటు రాకపోవడంతో ఆయన వర్గంతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆర్థర్‌ నిర్ణయాన్ని నేటికీ ప్రకటించలేదు. ఆయన పార్టీలోనే కొనసాగుతారా ? లేక కాంగ్రెస్‌లోకి వెళతారా..? లేక టిడిపిలోకి వెళ్తారా..? అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్థర్‌ కాంగ్రెస్‌ వైపు వెళితే టిడిపికి ప్లస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయన ఎటు వెళ్లకుండా వైసిపిలోనే కొనసాగితే ఆ పార్టీకే ప్లస్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారు. అంతేకాక తెలంగాణలో కస్టమ్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న వేల్పుల ఆనంద్‌ కుమార్‌ కూడా వైసిపి సీటు కోసం ప్రయత్నించి నందికొట్కూరు నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకూ సీటు రాలేదు. టిడిపిలో మాండ్ర శివానందరెడ్డి బలపరిచే అభ్యర్థి జయసూర్య, మరో అభ్యర్థి కాకరవాడ చిన్నవెంకటస్వామి, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండి జయరాజు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. జయసూర్య ఇప్పటికే టిడిపి తరుపున ప్రచారం చేస్తున్నారు. టిడిపి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తున్నారు. ఇక్కడ జనసేన ప్రభావం పెద్దగా లేదు. కానీ టిడిపి, జనసేన, బిజెపి పొత్తు కుదిరితే ముస్లిం, క్రిస్టియన్లు టిడిపికి ఓటు వేస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. అయితే ఈసారి టిడిపిని ఎలాగైనా గెలిపించుకుంటామనే ధీమాతో మాండ్ర శివానందరెడ్డి ఉన్నారు. నందికొట్కూరు నియోజవర్గంలో వామపక్షాలు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో వామపక్షాల ప్రభావం కూడా ఉంటుందను కున్నారు. నందికొట్కూరులో మాల మాదిగ సామాజిక తరగతికి చెందిన నాయకులు, ఓటర్లు అధికంగా ఉన్నారు. వైసిపి మాల సామాజిక తరగతికి టికెట్‌ కేటాయించింది. టిడిపి కూడా అదే సామాజిక తరగతికి ఇస్తే గట్టి పోటీ ఉండవచ్చని అనుకుంటున్నారు. వైసిపి అభ్యర్థి నాన్‌లోకల్‌ అనే ప్రచారం జరుగుతుంది. స్థానికులకు టిడిపి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి నందికొట్కూరు ప్రజలు 2024 ఎన్నికలలో ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. మరోపక్క కాంగ్రెస్‌ పార్టీ 2024 ఎన్నికల్లో ప్రభావం చూపుతుందను కుంటున్నారు. వైఎస్‌.షర్మిల పిసిసి పార్టీ పగ్గాలు చేపట్టాక దాదాపుగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. నందికొట్కూరు నియోజక వర్గంలో టిడిపి, వైసిపిలలో సీటు కోసం ప్రయత్నాలు చేసి విఫలమైన వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరవచ్చనుకుంటున్నారు. బలమైన నాయకులు ఆర్థర్‌, లేదా లబ్బివెంకటస్వామి కాంగ్రెస్‌లోకి వస్తే భారీగా అధికార ప్రతిపక్ష పార్టీలకు నష్టం కలిగే అవకాశాలున్నాయని చర్చ నడుస్తోంది. అభ్యర్థులను బట్టి పరిస్థితులు మారవచ్చు.

➡️