నేడు రైతు నిరసన ప్రదర్శన

Feb 25,2024 16:35

మాట్లాడుతున్న ఎపి రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ నాయకులు

నేడు రైతు నిరసన ప్రదర్శన
– ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించాలి
– ఢిల్లీ సరిహద్దు రైతు ఉద్యమాలకు మద్దతు
– ఎపి రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ
ప్రజాశక్తి – నంద్యాల
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను నిరసిస్తూ నేడు సోమవారం రైతు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఎపి రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ నాయకులు తెలిపారు. ఎపి రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల పట్టణంలోని టి.నరసింహయ్య భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతు, కౌలు రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు ఎ.రాజశేఖర్‌, సుధాకర్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెఎండి.గౌస్‌లు మాట్లాడారు. దోహా నగరంలో ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం జరుగుతుందని, ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థ ప్రతిపాదనలను నిరసిస్తూ రైతులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరారు. వాణిజ్య సంస్థ ప్రతిపాదనలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఈ ప్రతిపాదనలు సూచిస్తున్నాయని దుయ్యబట్టారు. డబ్ల్యుటిఒ వివిధ దేశాల ప్రభుత్వాలను పంటల కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను రద్దు చేయాలని ఆదేశిస్తుందని, ఈ ఆదేశాలను భారతదేశం లాంటి వ్యవసాయం మీద ఆధారపడిన దేశాలన్నీ తిరస్కరించాలని కోరారు. గత కొన్ని రోజులుగా హర్యానాలో జరుగుతున్న రైతు ఉద్యమాల్లో ఐదుగురు రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని, దీనికి కారణమైన హర్యానా ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పంజాబ్‌ సరిహద్దులో ఈ ఘాతుకానికి పాల్పడిన కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలకు ఆదేశాలు జారీ చేసిన హర్యానా ముఖ్యమంత్రిపై, హోంమంత్రిపై, కేంద్ర హోంమంత్రిపై కేసులు నమోదు చేయాలని పంజాబ్‌ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రైతులపై కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దమనకాండను కోనసాగిస్తూంటే నోరు మెదకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రైతులపై కేంద్రం దమనకాండను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో రైతు ఉద్యమం సెగతో నిరసన వ్యక్తం చేయని రాజకీయ పార్టీలకు రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశవ్యాప్త రైతు నిరసన ప్రదర్శనలో భాగంగా నంద్యాల జిల్లాలో నియోజకవర్గ కేంద్రాల్లో రైతు, కార్మిక, ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టాలని కోరారు. అంతకుముందు రైతు ఉద్యమంలో అమరులైన వారికి ఒక్క నిమిషం మౌనం పాటించి జోహార్లు అర్పించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు వి.బాల వెంకట్‌, డి.లక్ష్మణ్‌, రైతు సంఘం నాయకులు సురేష్‌, జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️