నేడు వసంత పంచమి వేడుకలు

Feb 13,2024 19:56

ముస్తాబైన కొలనుభారతి ఆలయం

నేడు వసంత పంచమి వేడుకలు
– కొలనుభారతి ఆలయం ముస్తాబు
– రాష్ట్రంలో ఏకైక సరస్వతీ దేవి ఆలయం
ప్రజాశక్తి – కొత్తపల్లి
కొత్తపల్లి మండలంలో వెలసిన కొలనుభారతి ఆలయంలో నేడు వసంత పంచమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలను ఆలయాన్ని సంబంధిత అధికారులు ముస్తాబు చేశారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఏకైక సరస్వతి దేవాలయం కొలను భారతీ ఆలయం. ఆలయంలో వెలసిన చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నల్లమల అడవుల్లో వెలసిన కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వేలాది భక్తుల నడుమ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ముందుగానే జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆలయ ప్రాంగణంలో పనులను పూర్తి చేశారు. భక్తులకు అవసరమయ్యే అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వసంత పంచమి వేడుకలకు చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ముస్తాబు అవుతారు. సరస్వతి దేవి అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం నుంచి వేకుజామునే దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చిన భక్తులందరికీ పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.కొలనుభారతి ఆలయానికి ఇలా వెళ్లాలి..కొలనుభారతి క్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవిలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే నంద్యాల జిల్లా కేంద్రం నుంచి వచ్చే వారు ఆత్మకూరుకు చేరుకోవాలి. ఆత్మకూరు నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా కొత్తపల్లి, లింగాపురం, శివపురం, శివపురం చెంచు గూడెం నుంచి కొలను భారతి ఆలయం చేరుకోవచ్చు. కర్నూల్‌ నుంచి నందికొట్కూరు, జూపాడు బంగ్లా, పాములపాడు చేరుకొని అక్కడి నుండి చెలిమిల్ల, కొత్త మాడుగుల, లింగాపురం మీదుగా కొలనుభారతి ఆలయం చేరుకోవచ్చు. ఈ రెండు రహదారుల ద్వారా భక్తులు వాహనాల్లో ఆలయం చేరుకోవచ్చు.

➡️