పింఛన్ల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు

Mar 31,2024 17:14

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

పింఛన్ల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు
– ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
ప్రజాశక్తి – బనగానపల్లె
ఏప్రిల్‌ 1వ తేదీన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు కాటసాని ఓబుల్‌ రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1వ తేదీ తెల్లవారుజామున పింఛన్‌దారులకు వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేసే వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు ఏప్రిల్‌ 1వ తేదీన పింఛన్లను వాలంటీర్లు పంపిణీ చేయకుండా హైకోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సూపర్‌ సిక్స్‌ పథకాల పేరుతో వస్తున్నారని, నమ్మవద్దన్నారు. చంద్రబాబు ప్రజాగళం సభలో ప్రభుత్వ భూమి పేదలకు పంపిణీ చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. బిసి జనార్దన్‌ రెడ్డి ప్రభుత్వం ద్వారా గాని, సొంత నిధులతో పేద ప్రజలకు భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. తాము పేద ప్రజలకు పంపిణీ చేయాలనుకున్న ఎస్‌ఆర్‌బిసి భూమిని ప్రజలకు నివాసానికి అనుకూలంగా లేదని కోర్టుకు వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని పంపిణీ చేయనని బీసీ జనార్దన్‌ రెడ్డి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తనకు తమ్మడపల్లెలో ఉన్న 100 ఎకరాల భూమిని పేద ప్రజలకు రాసి ఇవ్వడానికి తాను సిద్ధమని, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి పేద ప్రజల కోసం స్థలం కొంటానన్న రూ. 60 కోట్లు డిపాజిట్‌ చేయడానికి సిద్ధమా అని సవాల్‌ చేశారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్‌ రెడ్డి, నాయకులు డాక్టర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ ఫైజ్‌, సైకిల్‌ షాప్‌ మహబూబ్‌ వలి, పెద్దన్న, పాపిరెడ్డి సుదర్శన్‌ రెడ్డి, కలాం, కరిముల్ల, గౌస్‌ పీరతదితరులు పాల్గొన్నారు.

➡️