మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 9,2024 21:34

మాట్లాడుతున్న జిల్లా ఎస్‌పి రఘువీర్‌ రెడ్డి, పాల్గొన్న కలెక్టర్‌ కె.శ్రీనివాసులు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్‌ కె.శ్రీనివాసులు
– ఏర్పాట్లపై ఎపి, తెలంగాణ, కర్నాటక అధికారులతో సమీక్ష
ప్రజాశక్తి – శ్రీశైలం
మార్చి 1 నుండి 11 వరకు శ్రీశైల క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీశైలంలోని అన్నపూర్ణ భవనం పక్కన గల సిసి కంట్రోల్‌ రూమ్‌లో జిల్లా ఎస్‌పి రఘువీర్‌ రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, ఎపి, తెలంగాణ, కర్నాటక అధికారులతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 1 నుండి 11 వరకు 11 రోజుల పాటు నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులువుగా మల్లన్నను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకునేలా అధికారులకు అప్పగించిన పనులను నిర్వహించాలని చెప్పారు. ప్రధానంగా క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, ట్రాఫిక్‌, వాహనాల పార్కింగ్‌, నిరంతర విద్యుత్‌ సరఫరా, పారిశుధ్యం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలతో పాటు వైద్య నిపుణులు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డిఎంహెచ్‌ఒకు సూచించారు. దోమలను అరికట్టేందుకు ఫాగింగ్‌ మెటిరీయల్‌ సిద్ధంగా ఉంచుకోవాలని మలేరియా అధికారిని ఆదేశించారు. శ్రీశైలంలోని పిహెచ్‌సి, దేవస్థానం ఆసుపత్రి, సున్నిపెంటలోని వైద్యశాల, శ్రీశైలంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల ఆసుపత్రి 24 గంటలపాటు నిర్వహించేలా వైద్యసిబ్బందిని కేటాయించాలన్నారు. 108 అంబులెన్సులు 7, పాదయాత్ర మార్గంలో 1 అంబులెన్సును ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైలం వరకు గతంలో సూచించిన విధంగా 31 ప్రదేశాలలో తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రవాణా సౌకర్యాల నిమిత్తం ఆంధ్ర ప్రాంతం నుండి 500 బస్సులు, తెలంగాణా నుండి 450, కర్ణాటక రాష్ట్రం నుంచి 170 కండీషన్‌లో ఉన్న బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత రీజినల్‌ మేనేజర్లు కలెక్టర్‌కు వివరించారు. విఐపిలు, వివిఐపిలు, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి వసతి ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు రాకుండా దేవస్థాన గదులు, ప్రయివేటు సత్రాలలో 35 శాతం గదులను స్వాధీనం చేసుకోవాలని ఆత్మకూరు ఆర్‌డిఒను ఆదేశించారు. ఆత్మకూరు నుండి దోర్నాల వరకు రోడ్డు ప్యాచింగ్‌ మరమ్మతులు, రేడియం స్టిక్కర్లు, రోడ్డుకిరువైపులా మట్టితో చదును చేసే పనులు వెంటనే ప్రారంభించాలని ఆర్‌అండ్‌బి ఇఇని ఆదేశించారు. దేవస్థానం ఇఒ డి.పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులకు సులభంగా స్వామివారి దర్శనమయ్యేలా 4 రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామని వివరించారు. మహా శివరాత్రి పర్వదినం రోజు 1.10 లక్షల మంది స్వామివార్లను దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాలను 35 లక్షల వరకు తయారు చేస్తున్నామన్నారు. మార్చి 8వ తేదీ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం ప్రభోత్సవం, అనంతరం రాత్రి 10 గంటల నుండి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాస రుద్రదాభిషేకం, అర్థరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం తదితర వైదిక కార్యక్రమాలన్నీ సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తామన్నారు. మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయని కలెక్టర్‌కు వివరించారు. ఎస్‌పి కె.రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ దోర్నాల నుంచి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా మార్గమద్యంలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ లేకుండా సిస్టమును డెవలప్‌ చేసుకోవాలని తెలిపారు. శ్రీశైలం ముఖద్వారం, సాక్షిగణపతి ప్రదేశాలలో వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని దేవస్థానం, అటవీశాఖ అధికారులకు సూచించారు. క్యూలైన్లలో భక్తులు తొక్కిసలాట లేకుండా అవసరమయ్యే మంచినీరు, చంటిపిల్లలకు పాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఇఒకు సూచించారు. భారీ వాహనాలను అటవీమార్గంలో అనుమతించకుండా డైవర్ట్‌ చేసేలా ప్రకాశం, నాగర్‌ కర్నూలు, కర్నూలు జిల్లాలో విస్తత ప్రచారం చేయాలని ట్రాన్స్‌ఫోర్ట్‌, సంబంధిత ట్రాఫిక్‌ డిఎస్‌పిలను ఆదేశించారు. ప్రాంతాల పరిశీలన : అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారులతో టోల్‌గేట్‌, వలయ రహదారి (రింగురోడ్డు), యజ్ఞవాటిక, పార్కింగు ప్రదేశం, మల్లమ్మ కన్నీరు ప్రాంతం, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రక్కన గల పార్కింగు ప్రదేశం, ఆర్టీసీ బస్టాండు తదితర ప్రాంతాలను పరిశీలించారు. సమావేశంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, డిఆర్‌ఒ పద్మజ, ఆత్మకూరు ఆర్‌డిఒ మిరియాల దాసు, అన్ని శాఖల జిల్లా అధికారులు, మార్కాపురం, దోర్నాల, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️