వ్యాపారులు ప్రజాసేవ చేయలేరు- బైరెడ్డి రాజశేఖరరెడ్డి

Mar 31,2024 17:16

మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి

వ్యాపారులు ప్రజాసేవ చేయలేరు- బైరెడ్డి రాజశేఖరరెడ్డి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
వ్యాపారాలు, భూ సెటిల్‌మెంట్లు చేసుకొనే వారు రాజకీయాల్లో ఉంటే ప్రజాసేవ చేయలేరని, వారి కాంక్ష అంతా వ్యాపారం, సంపాదనపైనే ఉంటుందని, అలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని, ప్రజా సేవ చేసే వారినే ఎన్నుకోవాలని టిడిపి సీనియర్‌ నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాలలోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని దాబరాల మసీదు దగ్గర నంద్యాల పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి కార్యాలయాన్ని ఆయన అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండి ఫరూక్‌, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకులు ఏవి సుబ్బారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా రాయలసీమ ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో, పార్లమెంట్‌లో, ఐఏబి సమావేశాల్లో కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. గుండ్రవుల ప్రాజెక్ట్‌ నిర్మిస్తే 20 టిఎంసిల నీరు నిల్వ ఉంటుదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ చేసేవాళ్లకు ప్రజాసేవ తెలియదన్నారు. కొండ సుంకేశుల, హైదరాబాద్‌, బెంగళూరు నుండి వచ్చిన స్థానికతరులు పోటీ చేస్తున్నారని, వారిని ప్రజలు తరిమికొట్టి స్థానికులను గెలిపించుకోవాలని కోరారు. ఫరూక్‌ను నంద్యాల అసెంబ్లీకి, బైరెడ్డి శబరిని పార్లమెంట్‌ అభ్యర్థిగా గెలిపించుకోవాలన్నారు. ఎన్‌ఎండి ఫరూక్‌ మాట్లాడుతూ నంద్యాల అభివీద్ధి తమ హయాంలోనే జరిగిందని అన్నారు. శిల్పా కుటుంబం వ్యాపారులపై దండయాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసుల్లో ఇరికించడం, వీళ్ళే పోలీసులకు ఫోన్‌లు చేయడం వంటి డ్రామాలు శిల్పా సోదరులు ఆడుతున్నారని విమర్శించారు. అందరం కలిసి పని చేసి ఏడు నియోజకవర్గాలతోపాటు, పార్లమెంట్‌ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకునేలా కష్టపడాలని శ్రేణులకు, నాయకులకు సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️