16న గ్రామీణ బంద్‌

Feb 12,2024 19:48

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌

16న గ్రామీణ బంద్‌

– జయప్రదం చేయండి : రైతు సంఘం

ప్రజాశక్తి – ఆత్మకూరు

కేంద్రలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16వ తేది దేశావ్యాప్త నిరసనోద్యమంలో రైతులు, కార్మికులు, వ్యవసాయకార్మికులు, ప్రజలు,పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నంలు అన్నారు. సోమవారం పట్టణంలోని డాక్టర్‌ ఏ. ధనుంజయ మీటింగ్‌ హాల్‌ నందు ప్రజాసంఘాల సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహ నాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ 2020-21వ సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ మద్దతు ధరల చట్టాన్ని తీసుకువస్తామని, విద్యుత్‌ సవరణ బిల్లు రైతుసంఘాలతో చర్చించిన తరువాత పార్లమెంటులో ప్రవేశ పెడతామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కార్మికుల హక్కులను కాలరాస్తూ తెచ్చిన 4 లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి అమలు చేయాలన్నారు. దేశావ్యాపిత నిరసనోద్యమానికి సంయుక్త కిసాన్‌ మోర్చా రైతు సంఘాల ఐక్యవేదిక, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు ఇచ్చాయని తెలిపారు. ఉపాధి హామి చట్టాన్ని బలోపేతం చేయాలని, కనీస వేతనం రూ.600 ఇస్తూ, 200 రోజులు పని కల్పించాలన్నారు. పట్టణ పేదలకు అమలు చేయాలని, రైతులు, కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలని, సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులలో లక్ష కోట్లు ఖర్చు చేయకుండా ఖాజానాకు తిరిగి జమ చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు రామ్‌ నాయక్‌, రజాక్‌, రణధీర్‌, వెంకటేశ్వరరావు, స్వాములు, వీరన్న, మాబాషా, సి. వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్‌, సురేంద్ర, రమణ, యేసేపు, బాలయేసు, తదితరులు పాల్గొన్నారు.

➡️