కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో పటిష్ట ఏర్పాట్లు

Apr 11,2024 18:01

కౌంటింగ్‌ కేంద్రాలను, స్ట్రాంగ్‌ రూములను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్‌పి

కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో పటిష్ట ఏర్పాట్లు
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.శ్రీనివాసులు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
పోలింగ్‌ అనంతరం ఈవిఎంలను స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల శివారు ప్రాంతంలోని ఆర్‌జిఎం ఇంజనీరింగ్‌ కాలేజీ, శాంతిరాం మెడికల్‌ కళాశాల, శాంతిరాం ఫార్మసీ కాలేజీలలో సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లను జిల్లా ఎస్పీ కె. రఘువీర్‌ రెడ్డితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ మల్లికార్జునరెడ్డి, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌లను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లలో విద్యుత్‌ సౌకర్యం, సీసీ టీవీ కెమెరాలను అమర్చడంతో పాటు బారికేడింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కూర్చునేందుకు చుట్టూరా బారి కేడింగ్‌, అభ్యర్థులు, ఏజెంట్లు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక దారి తదితర ఏర్పాట్లను నిబంధనల మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. చేపట్టిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రిసెప్షన్‌ సెంటర్‌, మీడియా సెంటర్‌ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూముల దగ్గర కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో నిరంతర నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

➡️