సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ
ప్రజాశక్తి – పార్వతీపురం : మే నెల 20న దేశ వ్యాప్తంగా జరుగనున్న సమ్మెని జయప్రదం చేయాలను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి జిల్లా సమావేశం లో ఆమె మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని, మేడే దినోత్సవాన్ని పోరాట స్ఫూర్తి కలిగి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 లేబర్ కోడ్లను రద్దుచేసి 4లేబర్ కోడ్ లుగా మార్పు తీసుకురావడం కార్మికుల మేడకు తాడు లాంటిదన్నారు. దీని ద్వారా కార్మికులు వేతనాలను బేరమాడే శక్తిని, నిరసన తెలిపే హక్కులను కోల్పోతారని, కార్మికులను కట్టు బానిసలుగా మార్చబడతారని అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పద్ధతుల్లో విరివిగా ప్రసారం చేసి మే 20వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నసమ్మెలో కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయడానికి నాయకత్వం కషి చేయాలని అన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వలన కార్మికులు బతుకులు నానాటికి దుర్భరంగా మారుతున్నాయన్నారు. కార్మికులపై ప్రభుత్వం కక్ష పూర్తీకంగా వ్యవహరిస్తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు బివి రమణ, ఎన్‌వై నాయుడు, పి.రాము, కె.సాంబమూర్తి, వి.ఇందిర, శాంతి కుమారి, ఉమామహేశ్వరి, జి వెంకటరమణ, అన్ని రంగాల సంగాల సిఐటియు బాధ్యులు పాల్గొన్నారు.