ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి

Feb 4,2025 21:23

జిల్లా సమాఖ్య ద్వారా కషాయాల విక్రయం : కలెక్టర్‌ అంబేద్కర్‌

ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆదేశించారు. ఖరీఫ్‌ 2025లో ప్రకృతి వ్యవసాయ ప్రణాళికపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారుతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రకృతి సేద్యం, దాని విస్తరణ, ఆవశ్యకత, ఉపయోగాలు, నూతన ప్రయోగాలు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయశాఖ జెడి విటి రామారావు, ఎపి కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఆనందరావు మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న ప్రకతి వ్యవసాయం గురించి వివరించారు. కలెక్టర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ పద్దతులను సామాన్య రైతులకు మరింత చేరువ చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 27 మండలాల్లో 54 యూనిట్లు ఉన్నాయని, 220 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి సేద్యం జరుగుతోందని చెప్పారు. ఈ గ్రామాల్లోని 9716 మహిళా సంఘాలు భాగస్వామ్యం అవ్వగా, ఈ సంఘాల్లోని మొత్తం 1,12, 151 మంది సభ్యులు ఉన్నప్పటికీ, కేవలం 59,279 మంది మహిళలు మాత్రమే సుమారు 80వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్దతులను అనుసరించడం గానీ, అనుసరించడానికి ముందుకు రావడం గానీ జరిగిందని తెలిపారు. మిగిలిన వారందరూ ప్రకతి వ్యవసాయం చేసేవిధంగా వారిని చైతన్య పరచాలని సూచించారు. ప్రస్తుతం 28 శాతంగా ఉన్న వీరి సంఖ్య కనీసం 40 శాతానికి చేర్చేవిధంగా ఖరీఫ్‌ నాటికి ప్రణాళికను రూపొందించాలన్నారు. జిల్లా సమాఖ్య ద్వారా అవసరమైన కషాయాలు, రసాలు, పిఎండిఎస్‌ కిట్లను జిల్లా సమాఖ్య ద్వారా తయారు చేయించి, రైతులకు విక్రయించాలని కలెక్టర్‌ సూచించారు. మేనెల నాటికి ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని డిఆర్‌డిఎ పీడీ కల్యాణచక్రవర్తిని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డిడి జమదగ్ని, మైక్రో ఇరిగేషన్‌ పీడీ లక్ష్మీనారాయణ, డిపిఎం ఆనందరావు, ఎడిఎలు, ఎఒలు, ఎపిఎంలు, హెచ్‌ఒలు పాల్గొన్నారు.

➡️