ఎన్‌డిఎ కూటమిదే విజయం

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ

ప్రజాశక్తి- అనకాపల్లి

రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రింగ్‌ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లు రాత్రి ఒంటిగంట సమయం వరకు కొన్ని ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని తెలిపారు. తప్పకుండా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని, కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఎన్నికల్లో సహకరించిన జనసేన, టిడిపి, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో డాక్టర్‌ కెకెవిఎ.నారాయణరావు, బిఎస్‌ఎన్‌కె.జోగినాయుడు పాల్గొన్నారు.

➡️