నీరు పారే దారి కావలెను!

Jun 10,2024 00:42

అడవిని తలపిస్తున్న ఈమని, చింతలపూడి పంట కాల్వలు
ప్రజాశక్తి – దుగ్గిరాల :
150 ఏళ్ల చరిత్ర కలిగిన డెల్టా ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. డెల్టా సాగుకు ప్రధానమైన నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా విస్మరించబడింది. కాల్వకు కనీస మరమ్మతులు, పూడిక తీతలైనా లేక నీరు పారే దారి కనుమరుగైంది. మరమ్మతుల కోసం జల వనరుల శాఖాధికార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, అవి విస్మరణకు గురవడం కొన్నేళ్లుగా రివాజుగా మారింది. దుగ్గిరాల సెంటర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉండే తాడేపల్లి నుండి నిజాంపట్నం వరకు కాల్వల మరమ్మతుల కోసం గతేడాది రూ.కోటిన్నరతో అధికారులు పంపిన ప్రతిపాదనలు కార్యరూపం ద్చాలేదు. కొన్ని చిన్నాచితక పనులు చేపట్టినా వాటికీ బిల్లులు సకాలంలో మంజూరవ్వక కాంట్రాక్టర్లూ ఇతర పనులకు టెండర్లు వేయడానికైనా ముందుకు రాలేదు. వెరసి డెల్టాలో సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఖరీఫ్‌ సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కోతలకు గురైన తుంగభద్ర కాల్వకట్ట
5.71 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వ దుగ్గిరాలలోని బకింగ్‌ హామ్‌ కెనాల్‌ వద్ద ఆరు కాల్వలుగా చీలిపోతుంది. కొమ్మమూరు కాల్వ (తుంగభద్ర మద్రాసు కాల్వ) పరిధిలో సుమారు 2.64 లక్షల ఎకరాలు, నిజాంపట్నం తూర్పు పశ్చిమ పడవల కాల్వ పరిధిలో 1.52 లక్షల ఎకరాలు, బ్యాంక్‌ కెనాల్‌ పరిధిలో 1.55 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. దీంతోపాటు ఈ కాల్వల నుండి అనేక ఇతర పంట కాల్వలకూ నీరెళ్లి పొలాలను తడపాల్సి ఉంది. డెల్టా చివరి భూములకు సకాలంలో నీరందాలంటే కాల్వల్లో అడ్డంకులు లేకుండా నీరు సజావుగా పారితేనే సాధ్యమవుతుంది. అయితే ప్రస్తుతం కాల్వలతోపాటు వాటి కట్టలు రూపు మార్చుకున్నాయి. పలుచోట్ల కాల్వ కట్టలు నీటి కోతలకు గురై బలహీనపడ్డాయి. కాల్వల్లో ఏళ్ల తరబడి పూడికలు తీయని కారణంగా ఇసుక, మట్టి మేటలు వేశాయి. గుర్రపు, కంప చెట్లు పెరిగి అనేక చోట్ల కాల్వలు చిట్టడవులను తలపిస్తున్నాయి. దుగ్గిరాల, రేంవేంద్రపాడుతోపాటు ఇతరచోట్ల ఉన్న లాకులు సైతం శిథిలావస్థకు చేరాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పొలాలకు నీరందడం, పైరును బతికించుకుని మంచి దిగుబడి పొందడం రైతుకు దినదిన గండంగా మారింది. హైలెవల్‌ ఛానల్‌ కింద సాగయ్యే పెనుమూలి, కంఠంరాజుకొండూరు తదితర గ్రామాల్లో గతేడాది సాగునీరు సరిగా అందలేదు. ఎకరాకు రూ.5-10 వేల వరకూ రైతులు అదనంగా ఖర్చుచేసి ఇంజన్ల ద్వారా పొలాలను తడపాల్సి వచ్చింది.గతేడాది జూన్‌ 6న పంట కాల్వలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యం, కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరకపోవడం తదితర కారణాలతో నీటి విడుదల లేకపోవడం ఒకెత్తయితే పంట కాల్వల మరమ్మతులు అసలే లేవు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో రైతులు తమ పొలాలను దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో ప్రధాన పంట వరి కాగా మెట్ట పంటలైన పసుపు, అరటి, ఆకు కూరలు తదితర పంటలూ సాగవుతుంటాయి. ఈ పైర్లన్నీ బతికాలన్నా, రైతు చేతికి పంట దక్కాలన్నా సకాలంలో నీటి విడుదల, అవి సజావుగా పారడానికి కాల్వల మరమ్మతులు అత్యవసరం. ఆ దిశగా నూతన ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

➡️