ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: న్యూరో సర్జరీలో వేలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ శేషాద్రి శేఖర్ సేవలు ప్రశంసనీయమని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏ.ఏడుకొండలరావు తెలిపారు. న్యూరో విభాగాధిపతి డాక్టర్ శేషాద్రి శేఖర్ పదవీ విరమణ సభ సోమవారం ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ న్యూరో సర్జరీలో తదనైన ముద్ర వేసి వేలాది మందికి ప్రాణం పోసిన ఘనత డా.శేషాద్రి శేఖర్‌కు దక్కుతుందన్నారు. ఒంగోలులో విద్యను అభ్యసించి ఇక్కడే పదవి విరమణ పొందటం శుభపరిణామమన్నారు. జిజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ మాట్లాడుతూ న్యూరో విభాగాధిపతి డాక్టర్ శేషాద్రి శేఖర్ నిబద్ధత, సేవలు ప్రజలకు అవసరమన్నారు. అనంతరం డాక్టర్ శేషాద్రి శేఖర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, న్యూరో విభాగం వైద్యులు డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ వలి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.తిరుమల రావు, వివిధ విభాగ అధిపతులు పాల్గొన్నారు.