కూటమి నేతలు దోపిడీకి కొత్త స్కెచ్‌….ప్రజా ప్రతినిధులు డమ్మీ

  • పనులు సర్పంచులకే కేటాయించాలని మొరపెట్టుకున్న వినని ఎమ్మెల్యే

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : కూటమి నేతలుకు దోచి పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కొత్త విధానాలను తెరపైకి తెస్తోంది.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆ పార్టీ నాయకులు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు.తాజాగా వారి కళ్లు ఉపాధి పనులపై పడ్డాయి.అధికారాన్ని అడ్డు పెట్టుకుని కింద స్థాయి నేతల జేబులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.దీనిపై స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఉపాధి హామీ నిధులతో జరిగే సిమెంట్‌ రోడ్డు పనులకు పంచాయతీ తీర్మానం అవసరమా పలువురు సర్పంచ్‌లు కూటమి నేతలకు భయపడి పంచాయతీ తీర్మానాలు చేస్తున్నారు.ఎమ్మెల్యే కార్యాలయం నుంచి టీడీపీ,జనసేన,బిజెపి నేతలచే పనులు చేయించాలని ఆదేశాలు ఇచ్చారని సర్పంచులు వాపోతున్నారు.ఈ విధానం పూర్తిగా జాతీయ ఉపాధి హామీ నిబంధనలకు విరుద్ధం.దీనిని బట్టి అధికారులపై కూటమి నేతల ఒత్తిడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గత నెల 16వ తేదీన ఎమ్మెల్యే పార్థసారధికి ఉపాధి హామీ పనులు కేటాయించాలని మొరపెట్టుకున్న సర్పంచులు....
గత నెల 16వ తేదీన ఎమ్మెల్యే పార్థసారధికి ఉపాధి హామీ పనులు కేటాయించాలని మొరపెట్టుకున్న సర్పంచులు….

సర్పంచ్‌లు,ఎంపీటీసీల అధికారాలకు చెక్‌
సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,జెడ్పీటీసీ సభ్యుల్లో వైఎస్సార్‌సీపీ చెందిన వారే అధికంగా ఉన్నారు.నిబంధన మేరకు ఉపాధి హామీ పనులు సర్పంచ్‌ల ద్వారానే జరగాలి.కానీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల అధికారాలను పక్కనపెట్టి కూటమి పార్టీలకు చెందిన వారికి ‘వెండర్‌’ పేరుతో దోచి పెట్టేందుకు చర్యలు తీసుకుంది.2014లో ఉన్న జన్మభూమి కమిటీ తరహాలో ఇప్పుడు వెండర్‌ (కాంట్రాక్టర్‌) విధానం తెరపైకి తెచ్చింది.దీని పేరుతో కూటమి నేతలే పనులు చేసేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు మార్గం కల్పించింది.

సర్పంచ్‌లు, ఎంపీటీసీలు డమ్మీ
అధికారంలోకి వచ్చేందుకు సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,ఎంపీపీల మీద కూటమి నేతలు విపరీతమైన ప్రేమ ఒలకబోశారు.వారికి అపరిమితమైన హక్కులు కల్పిస్తామని,స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చంద్రబాబు,పవన్‌ ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.తీరా అధికారం చేపట్టిన తర్వాత అందుకు విరుద్ధమైన విధానాలతో ముందుకెళ్తున్నారు.తమ హక్కులు కాలరాసేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులపై సర్పంచ్‌లు,ఎంపీటీసీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

2 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు
ఆదోని మండలం పరిధిలో వివిధ గ్రామాలకు సిమెంట్‌ రోడ్లు,కాలువలు, పశువుల షెడ్ల నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి.ఈ పనులకు సర్పంచ్‌లు తీర్మానాలు అవసరమైనా,అవేమీ పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం తమ పార్టీ నేతలకు కట్టబెడుతోంది.ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఉపాధి పనులకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గొప్పులు చెబుతున్నారు.అంతేకాకుండా పల్లె పండగ పేరుతో గ్రామాల్లో పనులకు ఎమ్మెల్యే పార్థసారథి శంకుస్థాపనలు చేశారు.

2 కోట్ల రూపాయల పనులు
ఆదోని మండలం పరిధిలో 24 గ్రామ పంచాయతీలకు,30రకాల పనులకు,
2కోట్ల రూపాయల కేటాయించారు.ఈ పనులు చేసేందుకు ఇప్పటికే అన్ని గ్రామాలలో పల్లె పండుగ వారోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే పార్థసారధి,మండల స్థాయి అధికారులతో కలిసి భూమి పూజలు చేశారు.భూమి పూజలు చేసి నెలలు గడుస్తున్న 24గ్రామాలలో,9గ్రామాలకు,11 రకాల పనులు చేపట్టారు. ఈ పనులు కూడా స్థానిక బిజెపి,టిడిపి,జనసేన లీడర్‌ చేస్తుండగా మరికొన్ని గ్రామాలలో పోటీ తీవ్రంగా ఉండడంతో కాంట్రాక్టర్‌ ద్వారా చేయిస్తున్నారు.

గ్రామాల వారిగా కేటాయించిన నిధులు
మండిగిరి గ్రామానికి 3పనులకు 22లక్షలు,కపటీ గ్రామానికి 2పనులకు 5లక్షలు,కుప్పగల్‌ గ్రామానికి 2పనులకు 7లక్షలు,పెసలబండ గ్రామానికి
2పనులకు 12లక్షల,పాండవుగల్‌ గ్రామానికి 2పనులకు 7లక్షల మిగతా గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి ఒక్క పని చేయించారు.ఆరెకల్‌ 4లక్షలు,
బసాపురం 10లక్షలు,బైచిగిరి 6లక్షలు,చాగి 10లక్షలు,దిబ్బనకల్‌ 6లక్షలు, దొడ్డినకేరి 4లక్షలు,గణేకల్‌ 7లక్షలు,హనావాలు 10లక్షలు,ఇస్వి 3లక్షలు, మదిరె 11లక్షలు,మాంత్రికి 8లక్షలు,నాగలాపురం 6లక్షలు,నెట్టికల్‌ 5లక్షలు, పెద్దహరివణం 15లక్షలు,పెద్దతుంబలం 12లక్షలు,సుల్తాన్పురం 5లక్షలు, సలకలకొండ 15లక్షలు,సంతేకూడ్లురు 8లక్షలు,విరుపాపురం 8లక్షలు కేటాయించారు.ఈ పనులన్నీ స్థానిక ప్రజాప్రతినిధులకు కేటాయించకుండా కూటమినేతలకు అప్పజెప్పారు.కానీ స్థానిక సర్పంచ్‌లకు స్థానం లేకుండా అధికార పార్టీ వారే అంతా తామై నడిపిస్తూ పనులు చేస్తున్నారు.ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లు,ఎంపీటీసీలను పూర్తిగా విస్మరించి గ్రామ స్వరాజ్యాన్ని అపహాస్యం చేశారనే విమర్శలున్నాయి.

పనులు సర్పంచులకే కేటాయించాలని మొరపెట్టుకున్న వినని ఎమ్మెల్యే
గత నెల 16వ తేదీన స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం అనంతరం సర్పంచులంతా కలిసి రాతపూర్వకంగా ఎమ్మెల్యే పార్థసారథికి వినతిపత్రం అందిస్తూ గ్రామాలలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి పనులు సర్పంచ్లు కేటాయించాలని మొరపెట్టుకున్న పెడచెవిన పెట్టారు.ఎమ్మెల్యే స్పందిస్తూ సర్పంచులు పార్టీలో చేరండి,పనులు చేసుకోమని ఆఫర్‌ ఇచ్చారు.దీంతో ఏ ఒక్క సర్పంచ్‌ కూడా ముందడుగు వేయకపోవడంతో పనులన్నీ స్థానిక బిజెపి,టిడిపి,జనసేన నాయకులకు కేటాయించారు. గ్రామాలలో మూడు పార్టీల నుంచి తీవ్రంగా పోటీ ఉండడంతో కొన్ని గ్రామాలలో కాంట్రాక్టర్లకు కేటాయించడం గమనార్ధం.

వెండర్స్‌కు అప్పగించడం చట్టవిరుద్ధం,పాండవుగల్‌ సర్పంచ్‌ కె.ఉమాదేవి
ఉపాధి పనులు సర్పంచ్‌లకు కాకుండా వెండర్స్‌ (కాంట్రాక్టర్లకు) అప్పగించడం చట్ట విరుద్ధం.ఈ పనులు సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే జరగాలని ఉపాధి హామీ పథకం చట్టంలో స్పష్టంగా ఉంది.వెండర్స్‌కు పనులు అప్పగించడమంటే సర్పంచ్‌ల హక్కులు కాలరాయడమే అవుతుంది.

➡️